అమరావతి : మరో మహిళ పట్ల భర్త చేస్తున్న దారుణాన్ని నిలువరించ వలసిన భార్యే భర్తను ప్రోత్సహించే విధంగా ప్రవర్తించిన దారుణ ఘటన విజయవాడలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. విజయవాడలోని అజిత్‌సింగ్ నగర్ ప్రాంతంలో నివాసముండే వివాహిత భర్త కేటరింగ్‌కు ఇతర ప్రాంతానికి వెళ్లాడు. ఇద్దరు పిల్లలతో కలిసి ఇంట్లో నిద్రిస్తుండగా ఇంటి సమీపంలో ఉండే దిలీప్, అతడి భార్య తులసి ఇంట్లోకి వెళ్లి ఆమెను బయపెట్టి తమ ఇంట్లోకి బలవంతంగా లాక్కెళ్లారు.
అనంతరం దిలీప్ ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. లైంగిక దాడికి పాల్పడ్డ ఘటనను భార్య తులసి వీడియోలు, ఫొటోలు తీసింది. మరుసటి రోజు కూడా ఇదేవిధంగా దౌర్జన్యం చేయడంతో పాటు ఈ విషయాన్ని బయటకు చెబితే పిల్లలను చంపేస్తామని బెదిరించడంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో బాధితురాలి ఫిర్యాదు మేరకు మహిళ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.