రామగిరి, సెప్టెంబర్ 03 : సింగరేణి సంస్థ ఆర్జీ-3 ఏరియాలోని అడ్రియాల లాంగ్వాల్ ప్రాజెక్టు (ఏపీఏ డివిజన్)లో గురువారం తెల్లవారుజామున ఎయిర్ ట్యాంకర్ పేలడంతో ఐదుగురు కార్మికులు గాయపడినట్లు తెలిసింది. నైట్ షిఫ్ట్ ముగింపు సమయంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు సమాచారం. పనులు ముగించుకుని కార్మికులు బయటకు వస్తున్న సమయంలో ఎయిర్ ట్యాంకర్ ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలినట్లు సమాచారం. పేలుడు ధాటికి సమీపంలో ఉన్న ఇద్దరు కార్మికులు అస్వస్థతకు గురికాగా, మరో ముగ్గురికి గాయాలైనట్లు తెలిసింది. ఘటనతో ప్రాజెక్టులో కొద్దిసేపు తీవ్ర ఆందోళన నెలకొంది.
సహచర కార్మికులు వెంటనే స్పందించి గాయపడిన వారిని బయటకు తీసుకొచ్చి ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం ఐదుగురిని పెద్దపల్లి జిల్లా గోదావరిఖని సింగరేణి ఏరియా హాస్పిటల్కు తరలించినట్లు సమాచారం. వైద్యులు వారికి చికిత్స అందిస్తున్నారు. ట్యాంకర్లో సాంకేతిక లోపం కారణంగానే పేలుడు సంభవించిందా, లేక ఇతర కారణాలేమైనా ఉన్నాయా అనే కోణంలో అధికారులు విచారణ చేపట్టారు. ఎయిర్ ట్యాంకర్ పేలుడుకు గల కారణాలు తెలియాల్సి ఉంది.