చండీగఢ్: రైలు పట్టాలు దాటుతుండగా రైలు ఢీ కొనడంతో సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) జవాన్ మరణించాడు. రైలు బలంగా ఢీ కొనడంతో అతడు గాల్లో ఎగిరిపడ్డాడు. హర్యానాలోని మహేంద్రగఢ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. 2001లో బీఎస్ఎఫ్లో చేరిన జవాన్ వీర్ సింగ్ ప్రస్తుతం రాజస్థాన్‌లోని బికనీర్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. అయితే ఇటీవల సెలవుపై హర్యానాలోని సొంత గ్రామానికి వచ్చాడు. సోమవారం తన సోదరిని కలిసేందుకు ఆమె నివాసం ఉంటున్న మజ్రా ఖుర్ద్ గ్రామానికి వెళ్తున్నాడు.
కాగా, క్రాసింగ్ వద్ద వీర్ సింగ్ రైలు పట్టాలు దాటుతుండగా రేవారి వైపు నుంచి వస్తున్న దురంతో ఎక్స్‌ప్రెస్ రైలు ఢీ కొట్టింది. ఆ రైలు చాలా వేగంగా ఢీ కొట్టడంతో అతడు గాల్లోకి ఎగిరి కొంత దూరంలో పడి చనిపోయాడు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్ట్‌మార్టం కోసం మహేంద్రగఢ్ ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మరోవైపు బీఎస్ఎఫ్ జవాన్ వీర్ సింగ్ అకాల మరణం గురించి ఆయన బెటాలియన్‌కు సమాచారం ఇచ్చారు. కాగా, రైలు వేగంగా ఆయనను ఢీ కొన్న సంఘటన అక్కడి సీసీటీవీలో రికార్డైంది.