Drugs smuggling | నల్లమందు స్మగ్లింగ్ చేస్తుండగా బీఎస్ఎఫ్ ఇన్స్పెక్టర్ పట్టుబడ్డాడు. ఆయనతో పాటు మరో ఇద్దరిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అసోం నుంచి వీరు రాజస్థాన్‌కు నల్లమందు రవాణా చేస్తున్నట్లు వీరిపై కేసు నమోదైంది. పోలీస్ కమీషనరేట్లో ఏర్పాటుచేసిన స్పెషల్ టీంకు అందిన పక్కా సమాచారం మేరకు దాడులు నిర్వహించి బీఎస్ఎఫ్ అధికారి సహా ముగ్గుర్ని అదుపులోకి తీసుకున్నారు.
అసోం నుంచి రాజస్థాన్‌కు ఓపియం రవాణా చేస్తున్నట్లు అందిన సమాచారం మేరకు సీఎస్టీ, చోము పోలీసులు ఉమ్మడి ఆపరేషన్ చేపట్టారు. ఏఎస్ 11 జే 1956 నంబర్ కారులో డ్రగ్స్ సరఫరా చేస్తున్న బీఎస్ఎఫ్ ఇన్స్పెక్టర్ రాజేంద్ర కుడితోపాటు స్మగ్లర్లు కైలాష్ దేవేంద్ర, మదన్ బరాలాలను అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి 1.38 కిలోల ఓపియంతోపాటు రూ.70,300 నగదును స్వాధీనం చేసుకున్నట్లు అదనపు డీసీపీ సులేష్ చౌదరి తెలిపారు.
పోలీసులకు పట్టుబడిన బీఎస్ఎఫ్ అధికారి ప్రస్తుతం మణిపూర్‌లో విధులు నిర్వర్తిస్తున్నాడు. పట్టుబడిన కారు కూడా ఈయనదే. పోలీసులకు అనుమానం రాకుండా కారును ఈ అధికారే డ్రైవింగ్ చేస్తున్నట్లు గుర్తించారు. స్మగ్లర్లు ఇచ్చిన సమాచారం మేరకు రాజేంద్ర కుడి నివాసంలో పోలీసులు సోదాలు చేపట్టి 4.7 కిలోల నల్లమందుతోపాటు ఓ పిస్టల్, రెండు మ్యాగజైన్లు, 12 లైవ్ క్యాట్రిడ్జులను స్వాధీనం చేసుకున్నారు. అసోంలో కిలోకు రూ.1.20 లక్షలకు కొనుగోలు చేసి రాజస్థాన్‌లో రూ.2 లక్షలకు కిలో చొప్పున విక్రయిస్తున్నట్లు స్మగ్లర్లు ఒప్పుకున్నట్లు అదనపు డీసీపీ సులేష్ చౌదరి చెప్పారు.