Auto Driver Suicide | కొత్తగూడెం టౌన్, ఫిబ్రవరి 11 : ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న ఓ ఆటో డ్రైవర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో ఆటో డ్రైవర్ ఇంట్లో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ విషాద ఘటన సుజాత్ నగర్ ండలం లక్ష్మీదేవిపల్లి తండా గ్రామపంచాయతీ పరిధిలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. లక్ష్మీదేవిపల్లి తండాకు చెందిన కున్సోత్ మనోజ్ కుమార్(23) ఇంటర్ వరకు చదువుకున్నాడు. ఆ తర్వాత చదువు మానేసి ఆటో డ్రైవర్గా మారాడు. ఆటోను అప్పు చేసి కొనుగోలు చేశాడు. ఇంట్లో ఆర్థిక సమస్యలతో పాటు ఆటోకు చెల్లించాల్సిన ఫైనాన్స్ కూడా చెల్లించకపోవడంతో వేధింపులు ఎక్కువయ్యాయి. దీంతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురైన మనోజ్.. పదిహేను రోజుల క్రితం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. కొత్తగూడెం విద్యానగర్లోని ఓ ప్రయివేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. మంగళవారం సాయంత్రం ప్రాణాలు కోల్పోయాడు.