అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో దారుణం జరిగింది. ప్రకృతి అందాలను తిలకించేందుకు వచ్చిన ఓ
విదేశి వనితకు మాయమాటలు చెప్పి అటవి ప్రాంతానికి తీసుకెళ్లి ఆమెపై లైంగిక దాడికి యత్నించిన సంఘటన నెల్లూరు జిల్లాలో చోటు చేసుకుంది. లిథూవేనియా దేశానికి చెందిన 27 ఏళ్ల మహిళ చెన్నై నుంచి బెంగళూరు మీదుగా గోవాకు బస్సులో బయలు దేరింది.
బస్సులో విదేశి కరెన్సీ చెల్లని కారణంగా మనుబోలు మండలం బద్దెవోలు వెంకన్న పాళేనికి చెందిన ఇంగిలాల సాయికుమార్ అనే వ్యక్తి ఆమె తరుపున రూ.720 కండక్టర్‌కు డబ్బులు చెల్లించి ఆమె వద్ద నుంచి రూ.5వేలు కరెన్సీని తీసుకుని ఆమెతో స్నేహం పెంచుకున్నాడు. ఆమె మిగతా డబ్బుల కోసం అడుగగా స్వగ్రామంలో ఇస్తానని తీసుకెళ్లాడు. అక్కడ గూడురు నివాసానికి చెందిన షేక్ అబీద్‌కు విదేశి మహిళ గురించి వివరించగా ఇద్దరు కలిసి ఆమెను పరిసర ప్రాంతాలు చూపించేందుకు ద్విచక్రవాహనంపై తీసుకెళ్లారు.
రావూరు అటవీ ప్రాంత సమీపంలో ఇద్దరు ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డారు. ఆమె ప్రతిఘటించి రోడ్డుపైకి చేరుకోగా రోడ్డుపై వెళ్తున్న వాహనదారులు ఆమెను సైదాపురం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. బాధితురాలు సెల్ఫోన్లో తీసిన వీడియో ఆదారంగా పోలీసులు సంఘటన జరిగిన నాలుగు గంటల్లోనే నిందితులను గుర్తించి పట్టుకున్నట్లు గూడురు గ్రామీణ సీఐ శ్రీనివాసులు రెడ్డి వెల్లడించారు. ఈ సంఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. మహిళా దినోత్సవం రోజున ఇలాంటి ఘటన చోటుచేసుకోవడం దారుణమని అన్నారు.