న్యూఢిల్లీ: కుక్క మొరుగుతున్నదని ఆగ్రహించిన ఒక బాలుడు దాని యజమానిని హత్య చేశాడు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ ఘటన జరిగింది. నజఫ్గఢ్లోని నంగ్లీ డైరీ ప్రాంతంలో 85 ఏండ్ల అశోక్ కుమార్ అనే వృద్ధుడు తన కుటుంబంతో కలిసి నివసిస్తున్నాడు. ఆయనకు ఒక పెంపుడు ఒక్క ఉన్నది. అయితే అది అదేపనిగా మొరగడంపై పొరుగున ఉండే 17 ఏండ్ల బాలుడు ఆగ్రహం వ్యక్తం చేశాడు. గత శుక్రవారం అతడు ఆ కుక్కను కొట్టాడు. దీంతో కుక్క యజమాని, ఆ యువకుడి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ ఘర్షణలో ఆ బాలుడు అశోక్ కుమార్ను ఇనుప రాడ్తో కొట్టాడు.
దీంతో కింద పడిపోయిన ఆ వృద్ధుడు అపస్మారకస్థితికి చేరాడు. కుటుంబ సభ్యులు వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అశోక్ కుమార్ ఆదివారం మరణించాడు. ఈ నేపథ్యంలో ఆయన భార్య మీనా పోలీసులకు ఫిర్యాదు చేసింది. తమ కుక్కను కాపాడేందుకు ప్రయత్నించిన భర్తపై యువకుడు ఇనుప రాడ్తో దాడి చేయడం వల్ల ఆయన చనిపోయినట్లు ఆరోపించింది. దీంతో ఆ మైనర్ బాలుడిపై హత్య కేసును పోలీసులు నమోదు చేశారు. అతడ్ని బుధవారం అరెస్ట్ చేశారు.