న్యూఢిల్లీ: తల్లిని వేధిస్తున్నందుకు, రైల్వే పోలీస్ అయిన తండ్రిని మైనర్ కుమారుడు కొట్టి చంపాడు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది. ఒక వ్యక్తి రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్)లో పని చేస్తున్నాడు. తాగి ఇంటికి వచ్చి భార్యను వేధించేవాడు. ఆగస్ట్ 22న రాత్రి పది గంటలకు మద్యం తాగి వచ్చిన ఆ వ్యక్తి 17 ఏళ్ల కుమారుడ్ని కాళ్లతో తన్ని తోశాడు. భార్యను అసభ్యంగా తిట్టాడు.
కాగా, ఆగ్రహించిన ఆ బాలుడు వంటగదిలోని చపాతీలు చేసే కర్రతో తండ్రి తలపై 20 సార్లు కొట్టాడు. దీంతో తీవ్రంగా గాయపడిన అతడ్ని రైల్వే ఆసుపత్రికి తరలించారు. అయితే మెదడు దెబ్బతినడం, హెమరేజిక్ షాక్తో ఆ వ్యక్తి మరణించాడు. దీంతో ఆసుపత్రి సిబ్బంది ఈ విషయాన్ని పోలీసులకు చెప్పారు. మృతదేహానికి పోస్ట్మార్టం నిర్వహించగా ఆగస్ట్ 31న రిపోర్ట్ వచ్చింది.
మరోవైపు చపాతీల కర్రతో తండ్రి తలపై పలు మార్లు కొట్టి హత్య చేసిన మైనర్ బాలుడ్ని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే తండ్రిని చంపాలన్న ఉద్దేశంతో కొట్టలేదని, తాగి వచ్చి తన తల్లిని నిత్యం వేధిస్తుండటంతో సహించలేక తండ్రికి బుద్ధి చెప్పాలన్న ఉద్దేశంతో కొట్టినట్లు ఆ బాలుడు పోలీసులకు తెలిపాడు.