Hyderabad | మలక్ పేట ఏప్రిల్ 10: రామా.. కృష్ణ.. అంటూ ఇంట్లో కూర్చోవాల్సిన వయసులో తండ్రి పింఛన్ డబ్బులపై ఆశపడ్డాడో వృద్ధుడు. దానికోసం ఎనిమిది మంది తోబుట్టువులతో గొడవకు దిగాడు. ఈ క్రమంలోనే తనకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారనే ఆవేశంతో 70 ఏండ్ల అన్న, 68 ఏండ్ల అక్కను కత్తితో విచక్షణారహితంగా ఇష్టమొచ్చినట్లుగా పొడిచాడు. ఈ దాడిలో అక్క మృతి చెందగా.. తీవ్రగాయాలైన అన్న చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. హైదరాబాద్‌లోని పాత మలక్‌పేటలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది.
ఎస్సై భరత్ కుమార్ కథనం.. పాత మలక్‌పేట డివిజన్ వాటర్ ట్యాంక్ ప్రాంతంలోని వెంకటరమణ అపార్ట్ మెంట్లోని ఫ్లాట్ నంబర్ 101 లో నివాసం ఉండే రఘుపతిరావు-అనసూయ దంపతులకు ఐదుగురు కుమారులు, నలుగురు కూతుళ్లు. విశ్రాంత రైల్వే ఉద్యోగి అయిన రఘుపతి రావు 2010లో చనిపోయారు. అప్పట్నుంచి అతని భార్య అనసూయకు పెన్షన్ డబ్బులు వస్తున్నాయి. అయితే తండ్రి పెన్షన్ డబ్బుల కోసం కుమారుడు మదన్‌రావు (63) తన తోబుట్టువులతో కొంతకాలంగా గొడవపడుతున్నాడు. తాజాగా బుధవారం రాత్రి కూడా తన తోబుట్టువులతో వాగ్వాదానికి దిగాడు. ఈ క్రమంలో సహనాన్ని కోల్పోయిన మదన్‌రావు తన అక్క లక్ష్మీ(68), అన్న సుదర్శన్(70)పై దాడి చేశాడు.
లక్ష్మీని మదన్‌రావు పొట్టలో నాలుగుసార్లు, ఛాతిలో మూడుసార్లు బలంగా పొడవడంతో తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతిచెందింది. సుదర్శన్ తీవ్రంగా గాయపడ్డారు. తన అన్న విచక్షణారహితంగా దాడి చేయడం చూసి భయపడిపోయిన మదన్‌రావు మరో సోదరి పోలీసులకు సమాచారం అందించింది. దీంతో ఘటనాస్థలికి చేరుకున్న చాదర్‌ఘాట్ పోలీసులు మదన్రావును అరెస్టు చేశారు. తీవ్రంగా గాయపడిన సుదర్శన్‌ను ఆస్పత్రికి, లక్ష్మీ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు.