Nigerian gang @ arrest | ప్రజలను మోసం చేస్తున్న నైజీరియన్ ముఠాలోని ముగ్గురు సభ్యులను నోయిడా పోలీసులు అరెస్ట్ చేశారు. వీరు ఉంటున్న నివాసాన్ని సోదా చేయగా బాలీవుడ్ నటి ఐశ్వర్యరాయ్ బచ్చన్ పేరిట తయారుచేసిన నకిలీ పాస్‌పోర్ట్ బయటపడింది. ఈ ముఠా సభ్యుల నుంచి 1.3 మిలియన్ల విలువ చేసే నకిలీ అమెరికా డాలర్లు, 10,500 యూరోలను స్వాధీనం చేసుకున్నారు. ఐశ్వర్యరాయ్ బచ్చన్ పేరిట తయారుచేసిన నకిలీ పాస్‌పోర్ట్‌తో ఎలాంటి మోసాలకు పాల్పడ్డారనే విషయాలను కూపీ లాగుతున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ముఠా సభ్యులు పలు పేరుగాంచిన కంపెనీల ప్రతినిధుల మాదిరిగా నటిస్తూ మూలికలను ఖరీదైన ధరలకు ఇచ్చేవారు. ఈ నైజీరియన్ ముఠా చాలా కాలంగా మ్యాట్రిమోనియల్ సైట్లు, డేటింగ్ యాప్‌ల ద్వారా వ్యక్తులను నిరంతరం లక్ష్యంగా చేసుకుంటున్నది. అంతే కాకుండా ఆర్మీ రిటైర్డ్ కల్నల్‌ను కూడా నేరగాళ్లు వదిలిపెట్టలేదు. ఆయనను రూ.1.81 కోట్ల మేర మోసం చేశారు. కల్నల్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించి ముఠా గుట్టును బయటపెట్టారు. ఈ ముగ్గురు సభ్యుల నుంచి ఐశ్వర్య పాస్‌పోర్ట్‌తో పాటు 6 మొబైల్ ఫోన్లు, 11 సిమ్‌లు, ల్యాప్‌టాప్ పెన్ డ్రైవ్‌లు, 3 కార్లు స్వాధీనం చేసుకున్నారు.
నైజీరియన్ నేరస్థులను ఐకే ఉఫెరెముక్వే, ఎడ్విన్ కాలిన్స్, ఒకోలోయ్ డామియన్లుగా గుర్తించారని దర్యాప్తు జరుపుతున్న పోలీసు అధికారి ఒకరు చెప్పారు. ముగ్గురిని గ్రేటర్ నోయిడాలో అరెస్టు చేశారు. అబాట్ ఫార్మాస్యూటికల్స్ కంపెనీతోపాటు ఇతర కంపెనీల యజమానులుగా నటిస్తూ ఈ ముఠా లక్షల రూపాయలను దోచుకుంటున్నట్లు పోలీసులు గుర్తించారు. అరెస్టయిన ముగ్గురు నేరస్థులకు వీసాలు, పాస్‌పోర్టులు కూడా లేవని పోలీసులు తెలిపారు.