ముంబై : దీపావళి పండుగ అందరి ఇంట్లో వెలుగులు నింపితే.. ఓ ఇంట్లో మాత్రం విషాదాన్ని నింపింది. గాజు గ్లాసులో పెట్టి పటాకులు కాల్చొద్దని చెప్పినందుకు ఓ వ్యక్తిని ముగ్గురు మైనర్లు హత్య చేశారు. ఈ దారుణ ఘటన ముంబైలోని శివాజీ నగర్లో సోమవారం రాత్రి చోటు చేసుకుంది.
శివాజీ నగర్‌కు చెందిన ఓ 12 ఏండ్ల బాలుడు గాజు గ్లాసులో పటాకులు పెట్టి కాలుస్తున్నాడు. తన ఇంటి సమీపంలో కాలుస్తుండటంతో గమనించిన సునీల్ శంకర్(21) అక్కడకు వచ్చి.. అలా కాల్చొద్దని బాలుడికి అడ్డు చెప్పాడు. ఈ క్రమంలో ఇరువురి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. బాలుడి అన్న(15)తో పాటు మరో స్నేహితుడు(14) అక్కడకు వచ్చేశారు. సునీల్ శంకర్‌ను ముగ్గురు కలిసి కొట్టారు. ఆ తర్వాత ముగ్గురిలో ఒకరు కత్తితో శంకర్‌పై విచక్షణారహితంగా దాడి చేశాడు.
తీవ్ర రక్తస్రావంతో బాధపడుతున్న బాధిత వ్యక్తిని స్థానికులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆయన ప్రాణాలు కోల్పోయాడు. శంకర్ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ముగ్గురిలో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో మైనర్ పరారీలో ఉన్నాడు.