Rajanna Siricilla | వేములవాడ రూరల్ : పుట్టిన వెంటనే మరణించాడో.. లేక ఏం జరిగిందో తెలియదు కానీ, ఓ మగ పసికందు మృతదేహాన్ని సంచిలో చుట్టి ఓ బ్రిడ్జి కింద పడేశారు. మృతదేహాన్ని పసిగట్టిన కుక్కలు ఆ సంచిని లాక్కెల్లి పసికందు దేహాన్ని పీక్కుతిన్నాయి. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించారు. ఆదివారం వెలుగులోకి వచ్చిన ఈ హృదయవిదారకర ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపల్ పరిధిలోని అయ్యోరుపల్లి శివారులో జరిగింది.
స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వేములవాడ మున్సిపల్ పరిధిలోని అయ్యోరుపల్లి గ్రామ శివారులోని బ్రిడ్జి కింద రెండు రోజుల క్రితం గుర్తు తెలియని వ్యక్తులు మగ శిశువు మృతదేహాన్ని సంచిలో వేసి పడేశారు. మృతదేహాన్ని పసిగట్టిన కుక్కలు పసికందును పీక్కుతిన్నాయి. అటుగా వెళ్లిన స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఎస్ఐ రఫీఖాన్ ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. పుట్టిన వెంటనే శిశువు మృతిచెందగా, సంచిలో వేసి ఇక్కడ పడేసినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. శిశువు మృతదేహాన్ని సిరిసిల్ల ఏరియా దవాఖానకు తరలించినట్లు చెప్పారు. కేసు నమోదు చేసుకొని పూర్తి విచారణ చేపడుతామన్నారు. కాగా, మృతదేహాన్ని పూడ్చిపెట్టకుండా ఇలా బయట పడేయడంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.