సూర్యాపేట : కారు అదుపుతప్పి ఆటోను ఢీకొట్టడంతో ఆరుగురికి తీవ్రగాయాలయ్యాయి. సూర్యాపేట రూరల్ మండలం ఇమాంపేట శివారులోని హెచ్పీసీఎల్ పెట్రోల్ బంకు వద్ద మధ్యాహ్నం ఈ దుర్ఘటన జరిగింది. సూర్యాపేట జిల్లా కేంద్రం నుంచి ప్రయాణికులతో నాగులపాటి అన్నారం వెళ్తున్న ఆటో (TS05 UB 0519)ను ఎదురుగా వస్తున్న కారు ఢీకొట్టింది. ఆటోలో ప్రయాణిస్తున్న ఆరుగురికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం హుటాహుటిన సూర్యాపేట జిల్లా కేంద్ర దవాఖానకు తరలించారు. కారు డ్రైవర్ మద్యం మత్తులో వాహనం నడిపిన కారణంగా ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. కారు డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.