న్యూఢిల్లీ: వ్యాపారవేత్త కారును అడ్డగించిన నలుగురు సుమారు రూ.2 కోట్ల నగదును దోచుకున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ ఘటన జరిగింది. ఢిల్లీ వ్యాపారి నరేంద్ర కుమార్ అగర్వాల్, తన బంధువు కరణ్ అగర్వాల్‌తో కలిసి మంగళవారం రాత్రి 9 గంటలకు కారులో ప్రయాణించారు. ఆ కారు వెనక డిక్కీలో కొన్ని బ్యాగుల్లో రూ.1.97 కోట్ల డబ్బులున్నాయి. ఈ విషయం తెలిసిన కొందరు పాత ఢిల్లీలోని చాందినీ చౌక్ నుంచి ఆయన కారును ఫాలో అయ్యారు.
స్కూటీపై వచ్చిన ఒక వ్యక్తి పెద్దగా జన రద్దీ లేని చోట ఆ కారును అడ్డగించాడు. ఆ కారు ముందు స్కూటీని నిలిపాడు. తుపాకీతో కారు డ్రైవర్, అందులోని వ్యాపారి, ఇతరులను బెదిరించాడు. వెంటనే ముగ్గురు వ్యక్తులు పరుగెత్తుకుని ఆ కారు వద్దకు వచ్చారు. కారు ముందు అద్దాలను పగులగొట్టారు. కారు వెనక డిక్కీని తెరువాలని డ్రైవర్‌ను బెదిరించారు. అంతలో ఇద్దరు కారు డిక్కీ వైపు పరుగెత్తారు. అది తెరుచుకోగానే అందులో ఉన్న డబ్బుల బ్యాగులను పట్టుకుని పరుగెత్తారు. అనంతరం ఆ నలుగురు వ్యక్తులు విడిపోయి అక్కడి నుంచి పారిపోయారు.
కాగా, ఈ దోపిడీ జరుగుతున్నప్పుడు కొన్ని వాహనాలు అటుగా వెళ్లినప్పటికీ ఎవరూ పట్టించుకోలేదు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు ఈ దోపిడీ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు ఘటన జరిగిన సమీపంలోని ఓ ఇంట్లో ఉన్న సీసీటీవీలో ఇదంతా రికార్డైంది. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
4 Men Stop Delhi Businessman's Car, Loot Nearly ₹ 2 Crore https://t.co/Espp42O5Zc pic.twitter.com/zQbxpwOBnv
— NDTV (@ndtv) March 30, 2022