Crime News | కళాశాల రెస్ట్ రూమ్లో ఒక విద్యార్థిపై వీడియో చిత్రీకరించినందుకు ముగ్గురు విద్యార్థినులను సస్పెండ్ చేసినట్లు ఆ కాలేజీ యాజమాన్యం ప్రకటించింది. కర్ణాటకలోని ఉడుపిలో ఓ కాలేజీలో ఆప్టోమెట్రీ కోర్సు అభ్యసిస్తున్న ముగ్గురు విద్యార్థినులు.. రెస్ట్ రూమ్లో ఉన్న విద్యార్థిని వీడియో తీశారు. ఈ సంగతి తెలియడంతో వారిని సస్పెండ్ చేసినట్లు యాజమాన్యం తెలిపింది. బుధవారం ఈ ఘటన చోటు చేసుకున్నది నేత్రజ్యోతి కళాశాల డైరెక్టర్ రష్మీ కృష్ణ ప్రసాద్ చెప్పారు. ఈ విషయం తమ దృష్టికి వచ్చిన మరునాడే వారిని సస్పెండ్ చేశామన్నారు. ఈ కళాశాలలోకి ఫోన్లు తీసుకు రావడంపై నిషేధం విధించారు. ఆ నిషేధాజ్ఞలు ఉల్లంఘించడంతోపాటు వీడియో తీయడం వారి సస్పెన్షన్కు కారణం అని రేష్మీ కృష్ణ ప్రసాద్ వెల్లడించారు.
సదరు ముగ్గురు విద్యార్థినులు తమ టార్గెట్ మరో అమ్మాయి అని, పొరపాటున వీడియో తీశామని బాధిత విద్యార్థినికి వారే చెప్పారు. ఆ వీడియోను కూడా బాధితురాలి ముందే ఆ విద్యార్థినులు డిలిట్ చేశారు. కానీ, బాధితురాలు ఈ సంగతి తన స్నేహితులకు చెప్పారు. వారు జరిగిన పొరపాటును యాజమాన్యం దృష్టికి తెచ్చారు.
తాము వెంటనే ముగ్గురు అమ్మాయిలను సస్పెండ్ చేశామని రేస్మీ కృష్ణ ప్రసాద్ చెప్పారు. కొన్ని అనివార్య కారణాల వల్ల బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడానికి ఇష్ట పడలేదన్నారు. అందువల్ల తామే పోలీసులకు ఫిర్యాదు చేసి, వీడియోగ్రఫీకి వినియోగించిన ఫోన్ను ఫోరెన్సిక్ పరీక్ష కోసం వారికి అందజేశామన్నారు. ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించామని మాల్పే పోలీసులు చెప్పారు.