న్యూఢిల్లీ: ఒక యువకుడు తన తల్లిని చంపి ఆ తర్వాత మూడు రోజులకు ఆత్మహత్య చేసుకున్నాడు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది. రోహిణి ప్రాంతంలో నివసించే 25 ఏళ్ల క్షితిజ్, గురువారం తన తల్లి మిథిలేషిని హత్య చేశాడు. మూడు రోజుల తర్వాత ఆదివారం రోజున గొంతు కోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
మరోవైపు ఆ ఇంటి నుంచి దుర్వాసన రావడంతో ఇరుగుపొరుగు వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు ఆ ఇంటికి చేరుకున్నారు. డోర్ లాక్ చేసి ఉండటంతో బాల్కానీలోని తలుపు ద్వారా ఆ ఇంట్లోకి ప్రవేశించారు. రక్తం మడుగుల్లో పడి మరణించిన క్షితిజ్తోపాటు బాత్రూమ్లో పడి ఉన్న తల్లి మృతదేహం వారికి కనిపించింది.
కాగా, ఆ ఇంట్లో ఉన్న 77 పేజీల సూసైడ్ నోట్‌ను గుర్తించిన పోలీసులు దానిని స్వాధీనం చేసుకున్నారు. తన తల్లిని గురువారం హత్య చేసి ఆదివారం తాను ఆత్మహత్య చేసుకున్నట్లు అందులో ఉంది. దీంతో ఫోరెన్సిక్ బృందాన్ని రప్పించి ఆధారాలు, నమూనాలు సేకరించారు. తల్లీ కుమారుల మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.