గురువారం 28 జనవరి 2021
Crime - Nov 10, 2020 , 18:41:19

ఆ సినిమా చూసాడు.. కిడ్నాప్‌ నాటకమాడి దొరికిపోయాడు

ఆ సినిమా చూసాడు.. కిడ్నాప్‌ నాటకమాడి దొరికిపోయాడు

బెంగళూరు: కన్నడంలో వచ్చిన క్రైమ్‌ కామెడీ థ్రిల్లర్‌ సినిమా చూసి ప్రేరణ పొందిన ఓ 16 ఏండ్ల కుర్రాడు.. సొంతంగా కిడ్నాప్‌ ప్లాన్‌ చేసి అడ్డంగా దొరికిపోయాడు. తండ్రి నుంచి పెద్ద మొత్తంలో డబ్బు లాగి జల్సాలు చేయాలనుకున్న ప్లాన్‌ బెడిసికొట్టింది. బెంగళూరు నుంచి తిరుపతికి పోయి నాటకమాడి పోలీసులకు చిక్కాడు.

బెంగళూరులోని కనక్‌పురాకు చెందిన 16 ఏళ్ల బాలుడి పేరు అక్షయ్ (మార్చబడింది). అక్షయ్ తండ్రికి వస్త్ర వ్యాపారం ఉంది. నవంబర్ 6 న జిరాక్స్‌ తీసుకొని వస్తానని బైక్‌పై బయటకెళ్లాడు. అక్కడి నుంచి నేరుగా బెంగళూరు చేరుకుని బైక్‌ను నయందహళ్లి మెట్రో స్టేషన్ సమీపంలో పార్క్ చేసి రైలు ఎక్కాడు. మెజెస్టిక్ చేరుకున్న తరువాత బస్సెక్కి తిరుపతికి వచ్చి ఒక లాడ్జిలో బసచేశాడు. ఇంతలో, అక్షయ్ ఇంటికి తిరిగి రాకపోవడంతో అతడి కుటుంబసభ్యులు తమ కుమారుడు తప్పిపోయినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. శనివారం ఉదయం కొడుకు ఫొటోను వాట్సాప్‌లో తండ్రి అందుకున్నాడు. అందులో అక్షయ్ అర్ధనగ్నంగా ఉండి.. చేతులు కట్టేసినట్లుగా కనిపిస్తున్నది. బాలుడిని విడుదల చేయాలంటే రూ.5 లక్షలు ఇవ్వాలంటూ టెక్స్ట్ మెసేజ్ కూడా ఫొటోతోపాటు పంపాడు. మెసేజ్‌ అందిన తరువాత పోలీసులు అప్రమత్తమై బాలుడి ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. సందేశాలు అందిన టవర్‌ ద్వారా బాలుడు తిరుపతిలోని ఒక లాడ్జిలో ఉన్నట్లు గుర్తించారు. ఒక బృందాన్ని తిరుపతికి పంపించి బాలుడిని అదుపులోకి తీసుకున్నారు.

తల్లిదండ్రుల నుంచి డబ్బును దోచుకోవటానికి కిడ్నాప్‌ నాటకం ఆడినట్లు అక్షయ్‌ పోలీసుల విచారణలో ఒప్పుకున్నాడు. కరోనా నేపథ్యంలో స్కూల్స్‌ మూతపడటంతో బాలుడిని చదువుకోవాలంటూ తల్లిదండ్రులు బలవంతం చేశారు. అయితే అతనికి చదువుకోవడంపై ఆసక్తి లేక ఇంటి నుంచి పారిపోవాలను అనుకున్నాడు. కన్నడ చిత్రం ఆపరేషన్ అలమెలమ్మ ప్రేరణతో కిడ్నాప్ ప్రణాళికను రూపొందించి దొరికిపోయాడు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo