Fire Accident @ Delhi | దేశ రాజధాని ఢిల్లీ నగరంలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ముండ్కా మెట్రో రైల్వే స్టేషన్కు సమీపంలోని మూడంతస్తుల వాణిజ్య భవనంలో మంటలు చెలరేగాయి. మంటల్లో చిక్కుకుని 20 మంది సజీవ దహనం కాగా, మరో 30 మందికి గాయాలయ్యాయని తెలుస్తుంది. గాయపడిన వారి సంఖ్య పెరిగే అవకాశం ఉందని సమాచారం.
ఈ సమాచారం తెలిసిన వెంటనే అగ్ని మాపకదళ సిబ్బంది 24 ఫైరింజన్లతో అక్కడికి చేరుకుని మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. సుమారు 70 మందిని అగ్ని మాపకదళ సిబ్బంది రక్షించారు. పోలీసులు, అగ్నిమాపకదళ సిబ్బంది కలిసి భవనం కిటికీలు పగులగొట్టి సహాయ చర్యలు చేపట్టారని పోలీసు అధికారి తెలిపారు. గాయపడ్డ వారిని చికిత్స కోసం దవాఖానలకు తరలించారు.
ఈ భవనంలోని మొదటి అంతస్తులో సీసీటీవీ కెమెరా, రూటర్ కంపెనీ కార్యాలయం పరిధిలో మంటలు చెలరేగాయి. తర్వాత రెండో అంతస్తుకు మంటలు వ్యాపించాయని తెలుస్తున్నది. కంపెనీ యజమానిని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.
మరోవైపు పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు, అగ్ని మాపక దళ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. ఈప్రాంతాన్ని పోలీసులు పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఘటన సమాచారం తెలిసిన వెంటనే వివిధ శాఖల ఉన్నతాధికారులు అక్కడికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు.