చండీఘఢ్ : లిఫ్ట్ ఇస్తానని నమ్మబలికి 22 ఏండ్ల యువతిని తుపాకీతో బెదిరించి లైంగిక దాడికి పాల్పడిన ఫ్రెండ్ ఉదంతం పంజాబ్లోని మొహాలి జిల్లా జిరక్పూర్లో వెలుగుచూసింది. అక్టోబర్ 29 రాత్రి బర్నాలా నుంచి మొహాలీకి తిరిగివస్తుండగా ఈ ఘటన జరిగిందని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో బాధితురాలు పేర్కొంది. లగేజ్ ఎక్కువగా ఉండటంతో బస్టాప్ నుంచి తనను పికప్ చేసుకోవాలని ఆమె తన స్నేహితుడు కుష్విందర్కు ఫోన్ చేసింది.
ఎస్యూవీలో బస్టాప్ వద్ద ఆమెను రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో కుష్విందర్ పికప్ చేసుకున్నాడు. అయితే ఆమె ఉంటున్న పేయింగ్ గెస్ట్ వసతి వద్ద విడిచిపెట్టకుండా బాధితురాలిని నిర్జన ప్రదేశానికి తీసుకువెళ్లాడు. ఆపై ఆమెను తుపాకీతో బెదిరించి లైంగిక దాడికి పాల్పడి రోడ్డుపై వదిలివేసి పరారయ్యాడు. క్యాబ్లో ఎలాగో ఇంటికి చేరుకున్న బాధితురాలు మరుసటి రోజు కుష్విందర్పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.