న్యూఢిల్లీ : దేశ రాజధానిలో మహిళలు, యువతులు, చిన్నారులపై లైంగిక దాడుల ఘటనలు కొనసాగుతున్నాయి. ఢిల్లీలోని ద్వారకా పార్క్‌లో పోలీస్ కానిస్టేబుల్‌నని చెబుతూ రిటైర్డ్ సుబేదారి యువతి (19)ని బెదిరించి లైంగిక దాడికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. జనవరి 28న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాలికపై నిందితుడు లైంగిక దాడికి పాల్పడగా ఆమె స్నేహితురాలిని మరో వ్యక్తి లైంగికంగా వేధించాడు.
బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం..జనవరి 28న ఖాకీ దుస్తుల్లో ఉన్న వ్యక్తి తమ వద్దకు వచ్చి తాను పోలీసునని, మీ ప్రవర్తన అనుమానాస్పదంగా ఉందని కేసు పెడతానని బెదిరించాడని యువతి తెలిపింది. ఆపై ఫిర్యాదిదారు స్నేహితురాలిని కొట్టిన నిందితుడు ఐడీ కార్డులు చూపాలని డిమాండ్ చేశాడు. తాము ఆధార్ కార్డులను ఫోన్లో చూపినప్పటికీ నిందితుడు తన స్నేహితురాలిని వేధించి రూ 11,000 జరిమానా చెల్లించాలని కోరాడని తెలిపింది.
దీనికి తాము నిరాకరించడంతో తమను ద్వారకా సెక్టార్ 23 పోలీస్ స్టేషన్‌కు రావాలని బెదిరించాడని వెల్లడించింది. ఆపై రూ 6000 తమ వద్ద నుంచి తీసుకున్నాడని ఈ క్రమంలో తమను లైంగిక వేధింపులకు గురిచేశాడని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. తమపై తప్పుడు కేసు నమోదు చేసి తల్లితండ్రుల ప్రతిష్టను దెబ్బతీస్తానని బెదిరించాడని తెలిపింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.