దోశలు పుట్టినూరు.. మైసూరుపాక్ను దత్తు తీసుకున్న ఊరు బెంగళూరు. ఈ గ్రీన్‌సిటీలో ఎవర్గ్రీన్ రుచులు కోకొల్లలు. యశ్వంత్‌పూర్ జంక్షన్ నుంచి కన్నడ రాజధాని రుచుల పరిమళం మొదలవుతుంది. వీధి వీధిలో ఫుడ్ కోర్టులు, వాడ వాడలో కాఫీ బెల్టు షాపులు పలకరిస్తాయి. ఇంకేం… వేకువజాము నుంచి జామురాతిరి వరకు అది బేకు.. ఇది బేకు.. (అది కావాలి.. ఇది కావాలి..) అంటూ బ్రేకుల్లేకుండా ఆహార విహారం చేస్తూ బేకోట్లు వచ్చేదాకా తిన్నుత్తలే ఇరుత్తారే (తింటూనే ఉంటాం). ఎందుకు ఆలస్యం చవులూరించే బెంగళూరు తిండిగళు ప్రయాణం మొదలెడదాం..
Bengaluru | బెంగళూరు అనగానే ఆహార ప్రియులకు టక్కున గుర్తొచ్చే ఏరియా వివి పురం. విడమర్చి చెబితే విశ్వేశ్వరపురం. ఇక్కడ విందు ఆరగించాలంటే జిహ్వ చాపల్యం మాత్రమే ఉంటే సరిపోదు. కడుపు పూర్తిస్థాయిలో ఖాళీగా ఉంటేనే సుష్టుగా తినగలం. పుదీనా ఫ్లేవర్ రంగరించుకున్న చట్నీతో అభిషేకించిన ఇడ్డెన్లు (ఇడ్లీలు) డజన్‌కు తక్కువ కాకుండా లాగించొచ్చు. అసలు సిసలు సౌత్ ఇండియన్ అట్టు సువాసన వివి పురలో వెరీవెరీ గుడ్ అనిపిస్తుంది. దోశ ముక్క తుంచి.. కొబ్బరి పచ్చడిలో ముంచి.. అల్లం చట్నీలో అద్ది.. సాంబారులో తేల్చి.. నోట కరుస్తాడు. దోశతో బ్రేక్‌ఫాస్ట్ ముగించేస్తే ఆత్మారాముడికి ద్రోహం తలపెట్టినవారు అవుతారు. చిట్టి చిట్టి పడ్డూలను కందిపొడిలో నంజుకుని తింటేనే అసలు మజా! మన గుంతపొంగనాలనే ఇక్కడ పడ్డు అంటారు. ఎక్కడ ఎలా ఉన్నా.. వివి పురంలో పడ్డూలు తిన్నాక మనసు పల్టీలు కొట్టడం ఖాయం.
ఇన్ని టిఫినీలు చేశాక కాఫీలు తాగాలి కదా! బెంగళూరులో గరం గరం కాఫీ దొరకని నెలవు లేదు. అన్ని రుచులూ ఒకెత్తు.. శంకరపురలోని బ్రాహ్మణ్స్ కాఫీ బార్ రుచి ఒకెత్తు. 1965లో మొదలైన ఈ కాఫీ బార్ వచ్చే ఏడాది షష్టిపూర్తి జరుపుకోనుంది. చిక్కటి ఫిల్టర్ కాఫీ తాగినప్పుడు ఓ క్షణం బొందితో బసవేశ్వరుడి సన్నిధానానికి వెళ్లిన అనుభూతి కలుగుతుంది. ఆ అలౌకిక స్థితిలో ‘నాలుకకు నరాలుంటే ఎంత బాగుండు, ఈ టేస్టుకు అవి కూడా జివ్వుమనేవ’ని కాఫీ ప్రియులు ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చేస్తారు.
కాఫీ రుచి కనుమరుగయ్యాక మల్లేశ్వరంలోని తిండిబీదికి పని గట్టుకొని మరీ వెళ్లాల్సిందే! వివి పురంలో చవిచూడని రుచులను ఇక్కడ ఆస్వాదించొచ్చు. ఆ తర్వాత రైల్వే స్టేషన్‌కు వెళ్లి… మైసూర్ రైలు పట్టుకోండి. మద్దూరు దాకే టికెట్ తీసుకోవాలి. అది ఇక్కడికి 81 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఆ ఊరు సమీపిస్తుండగానే కన్నడ కస్తూరి పరిమళాన్ని మరిపించే ఓ సువాసన బోగీ అంతా వ్యాపిస్తుంది. రైలు నెమ్మదిస్తుంది. రుచుల వేటలో ఉన్న ప్రయాణికుల్లో ఆత్రం పెరుగుతుంది. అప్పటి దాకా కిటికీలకు అతుక్కుపోయిన వారంతా లిప్తపాటులో బోగీ ఉభయ ద్వారాల్లో ఏది దగ్గరో అటుగా పరిగెత్తినంత పనిచేస్తారు.
రైలు ఆగకముందే.. ఆగమేఘాలతో రన్నింగ్‌లో దిగేస్తారు. అప్పటికే వేడివేడి మసాలా వడలతో చిరుతిళ్ల వ్యాపారులు సిద్ధంగా ఉంటారు. పొలోమని అంతా వాళ్ల చుట్టూ మూగుతారు. ‘ననగే నాలగు ఫలకగళన్ను’ (నాకు నాలుగు ప్లేట్లు) అని ఎగబడతారు. రైలు కదిలే లోపు అవి దొరికినవాళ్లు అదృష్టవంతులు. మద్దూరు వరకే టికెట్ తీసుకున్నవాళ్లు మరింత పుణ్యాత్ములు. తీరిగ్గా వేడివేడి మద్దూరు వడలు అప్పటికప్పుడు వేయించుకొని, బాగా వేగినవి ఎంచుకొని తృప్తిగా తిని సాయంత్రానికి బెంగళూరుకు తిరుగు ప్రయాణం అవుతారు.
మద్దూరు వడ ఇచ్చిన మత్తు మరింత హెచ్చాలంటే బెంగళూరుకు వచ్చీ రాగానే… కన్నడ ఇలాఖా రుచి మైసూరు పాక్‌ను కొరుక్కు తినాల్సిందే! ఆ సాయంత్రం మసీదు రోడ్డులోని ఫ్రేజర్ టౌన్‌కు వెళ్లి వేడివేడి కబాబులు చూస్తూనే… బాబ్బాబు ముందుగా కబాబు నాకు బేకవా అని బతిమాలుకుంటారు. బోటీ కబాబుతో బోణీ చేసి చికెన్ కబాబుతో ఆ రోజుకు స్వస్తి పలకొచ్చు.
అప్పుడే బెంగళూరు రుచుల యానం పూర్తవ్వదు. కడుపులో గడబిడగా ఉంటే భాస్కర లవణం పొడి ఒక చెంచాడు వేసుకుంటే సరి. ఆపై విశ్రమించండి. అలారం పెట్టుకొని మరీ మర్నాడు మూడింటికల్లా నిద్రలేచి హోస్కోటె (బెంగళూరు నుంచి సుమారు 20 కి.మీ.) వెళ్లండి. మీరు చేరుకునే సరికి బిర్యానీ పొగలు ఆ ప్రాంతమంతా విస్తరించి ఉంటాయి. మరీ తెల్లవారుజామున ఏం తింటాం అనుకుంటే పొరపాటు. సూర్యోదయానికి బిర్యానీ డేకిసలన్నీ నిండుకుంటాయి. అందుకే పెందరాలే వెళ్లి బిర్యానీ తిని.. బస్సు ఎక్కి ఇందిరానగర్‌కు చేరుకునే సరికి రెండు త్రేన్పులు వస్తాయి. పొట్టలో కాస్త జాగా పుడుతుంది. అప్పుడు రామేశ్వరం కేఫ్‌కు వెళ్లి ఓపిక ఉంటే ప్లేట్ ఇడ్లీ ఆర్డర్ ఇవ్వండి. మా వల్ల కాదు అనుకుంటే ఘనమైన ఫిల్టర్ కాఫీ రుచి చూసి.. బెంగళూరు ఆహార యాత్రకు ఇంపైన ముగింపు పలకండి.
-కీర్తన