కావలసిన పదార్థాలు
నీళ్లు: రెండు గ్లాసులు, ఉసిరి తొక్కు: టేబుల్ స్పూన్ లేదా
పెద్ద ఉసిరికాయలు: నాలుగైదు
టమాటాలు: రెండు మూడు, రసం పొడి: టేబుల్ స్పూను
నూనె/ నెయ్యి: టేబుల్ స్పూను
ఆవాలు, జీలకర్ర: అరస్పూను చొప్పున
ఎండు మిరపకాయలు: రెండు
ఇంగువ: చిటికెడు, పసుపు : చిటికెడు
కొత్తిమీర: నాలుగు రెబ్బలు, ఉప్పు: తగినంత
తయారు చేసే విధానం
గిన్నెలో నీళ్లు పోసి బాగా మరిగించాలి. అందులో ఉసిరి తొక్కు (ఉప్పువేసి దంచి పెట్టుకున్నది) ఒక పెద్ద స్పూను వేయాలి. ఒక వేళ అది లేకపోతే ఉసిరికాయల్ని చిన్న ముక్కలుగా తరిగి మిక్సీ పట్టి, ఆ ముద్దను ఇందుకోసం వాడుకోవచ్చు. టమాటాలను చిన్న ముక్కలుగా తరిగి ఈ నీళ్లలో వేసి ఉడికించుకోవాలి. ఇది మన ఇష్టాన్ని బట్టి వేసుకోవచ్చు. లేదా ఉత్తి ఉసిరి చారే చేసుకోవచ్చు. ఒక స్పూను చారు పొడిని కూడా గిన్నెలో వేయాలి.
చిటికెడు పసుపుతో పాటు తగినంత ఉప్పును కూడా జోడించాలి. చారు బాగా మరిగాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు తిరగమోత మూకుట్లో కాస్త నెయ్యి లేదా నూనె వేసి కాగనిచ్చి, ఆవాలు, జీలకర్ర జోడించి… చిటపటలాడాక ఎండు మిరపకాయలు తుంచి వేయాలి. చివర్లో చిటికెడు ఇంగువను కూడా జోడించి, పోపు ముగించి చారులో ఒంపేయాలి. చివరగా సన్నగా తరిగిన కొత్తిమీరను చారు గిన్నెలో చల్లితే కార్తిక మాసంలో అన్నంతో పాటు తినేందుకు వేడివేడి ఉసిరి చారు సిద్ధం!