Ganesh Chaturthi | గులాబ్ జామ్.. పేరు వినగానే కొందరికి నోట్లో నీళ్లూరతాయి. జిలేబీని చూడగానే కొందరి ముఖం గులాబీలా విచ్చుకుంటుంది. అలా మనకే కాదు, ఏ శుభకార్యానికైనా నేనున్నానంటూ వచ్చే గణపతికి కూడా ఇలాంటి ఇష్టాలున్నాయి. కుడుములు చూస్తే బుజ్జి గణపతిగా బొజ్జ నిమురుకుంటాడు. ఉండ్రాళ్లు పోశామంటే బండరాళ్లలాంటి మన కష్టాలన్నీ కరిగించేందుకు ముందుకొస్తాడు. ఇక, ఆయన మోదక హస్తం అందుకోవాలంటే ఓ మోదకాన్ని సమర్పిస్తే చాలు. యుగాల నుంచీ గణపతి వ్రతం చేస్తున్నామని తరాలుగా అవే మోదకాలను సమర్పిస్తామా! వినాయకుడికి నైవేద్యంగా వినూత్న రకాలు..
కావలసిన పదార్థాలు
కాంపౌండ్ చాకొలెట్ : 150 గ్రా.మోతీచూర్ లడ్డూ: 100గ్రా. మోదక్ మోల్డ్‌లు
ఇలా చేయాలి
మైక్రోవేవ్ ఓవెన్లో 30 సెకన్ల నిడివితో నాలు గైదుసార్లు వేడిచేస్తూ చాకొలెట్‌ను కరగబెట్టాలి. లేదా ఒక పాత్రలో నీళ్లు పోసి మరో గిన్నెలో చాకొలెట్వేసి పొయ్యి మీద పెట్టి కూడా కరిగించవచ్చు (దీన్నే డబుల్ బాయిలర్ పద్ధతి అంటారు). తర్వాత ఆ ద్రవాన్ని మోదక్ తయారు చేసే మౌల్డ్‌లో పోసి తిరిగి వంపేయాలి. అప్పుడు మోదక్ మోల్డ్కి ఒక పొరలా చాకొలెట్ అంటుకుని ఉంటుంది. ఆ మోల్డ్‌ను రిఫ్రిజిరేటర్లో ఉంచాలి. గడ్డకట్టాక బయటికి తీసి అచ్చుల్లో మోతీచూర్ నింపాలి. తర్వాత మిగిలిన చాకొలెట్ మిశ్రమంతో దీన్ని మూసేయాలి. మళ్లీ ఫ్రిజ్‌లో పెట్టి, గడ్డకట్టాక తీస్తే చాకొలెట్ మోతీచూర్ మోదక్ సిద్ధం.
కావలసిన పదార్థాలు
జీడిపప్పులు: అర కిలో, చక్కెర: 400 గ్రా. పిస్తా ముక్కలు:125 గ్రా. గుల్కంద్: 200 గ్రా. ఎండు గులాబీ రేకులు : 25 గ్రా. డార్క్ చాకొలెట్ : 150 గ్రా. గోల్డ్ వరక్ : అలంకరణ కోసం
ఇలా చేయాలి
జీడిపప్పును గంటపాటు నానబెట్టి మిక్సీ పట్టి పేస్టులా చేయాలి. ఆ మిశ్రమాన్ని ఓ పాన్‌లో పంచదారతో కలిపి 15 నిమిషాలు ఉంచాలి. తర్వాత స్టవ్ సిమ్‌లో పెట్టి 45 నిమిషాల సేపు కలుపుతూ ఉండాలి. మరో పాత్రలో పిస్తా ముక్కలు, గుల్కంద్ కలిపి చిన్న ఉండలు చేయాలి. కాజూ మిశ్రమాన్ని అప్పచ్చిలా చేసి మధ్యలో గుల్కంద్ ఉంచి మళ్లీ ఉండ చుట్టుకోవాలి. మరోపక్క, చాకొలెట్‌ను ఒక గిన్నెలో వేసి.. మరో నీళ్లు పోసిన గిన్నెలో దాన్ని ఉంచి వేడిచేయాలి (డబుల్ బాయిలర్ విధానం). తయారైన మోదక్‌లను ఇందులో సగానికి ముంచి తీసి పక్కకు పెట్టుకోవాలి. గులాబీ రేకులు, గోల్డ్వరక్తో వీటిని అలంకరించుకోవాలి.
కావలసిన పదార్థాలు
బియ్యపు పిండి: ఒక కప్పు, నీళ్లు: కప్పున్నర, ఉప్పు: చిటికెడు, నెయ్యి: ఒక టేబుల్ స్పూన్, చాకొలెట్ హాజిల్‌నట్ స్ప్రెడ్: ఒక కప్పు, సన్నటి ముక్కలుగా వేయించిన హాజిల్ నట్స్: అర కప్పు, అమరెటీ కుకీస్ పొడి : అరకప్పు.
ఇలా చేయాలి
బియ్యపు పిండి, నెయ్యి, ఉప్పు ఒక పాత్రలో వేసి.. అందులో వేడి నీళ్లు పోసి బాగా కలిపి పక్కకు పెట్టుకోవాలి. మరో గిన్నెలో చాకొలెట్ హాజిల్ నట్ స్ప్రెడ్, వేయించిన హాజిల్‌నట్ ముక్కలు వేసి కలుపుకోవాలి. పిండిముద్దను ఉండల్లా చేసుకుని దాంతో కప్పు ఆకృతిని చేయాలి. అందులో హాజిల్ నట్ మిశ్రమం నింపి మూసేయాలి. తర్వాత మోదకాలను ఆవిరిలో ఉడికించాలి. ఇటాలియన్ టచ్ కోసం అమారెట్టి కుకీస్ పొడిలో దొర్లిస్తే సరి!
కావలసిన పదార్థాలు
హోల్ వీట్ బ్రెడ్: 5 ైస్లెసులు ముక్కలుగా చేసిన డ్రైఫ్రూట్స్, కొబ్బరి పొడి (వేయించినది) : అర కిలో తురిమిన చద్దార్ చీజ్ : 50 గ్రా.తేనె : 5 టీ స్పూన్లు నెయ్యి : వేయించడానికి సరిపడా
ఇలా చేయాలి
బ్రెడ్ అంచులను తీసేసి, నీళ్లలో ముంచి బ్రెడ్ ముక్కను అణిగేలా వత్తి పక్కకు పెట్టుకోవాలి. తర్వాత తేనె, చీజ్, వేయించిన డ్రైఫ్రూట్స్, కొబ్బరి పొడి.. అన్నిటినీ కలుపుకొని ఉండలుగా చేసుకోవాలి. తర్వాత బ్రెడ్‌ను అరచేతిలోకి తీసుకుని చిన్న కప్పులా చేసి అందులో ఈ మిశ్రమాన్ని ఉంచాలి. చుట్టూ మూసి చేతితో మోదక్ ఆకృతిలోకి వచ్చేలా నొక్కాలి. తర్వాత మూకుడులో నెయ్యి వేసి మోదక్‌లను ముదురు గోధుమ రంగు వచ్చేదాకా వేయించి, వేడివేడిగా వడ్డించాలి.
కావలసిన పదార్థాలు
మలాయ్ పేడా: 200 గ్రా. కుంకుమ పువ్వు: పావు టీస్పూన్ పచ్చి శనగపప్పు: 75 గ్రా., నల్ల బెల్లం: 100 గ్రా. యాలకుల పొడి : పావు టీ స్పూన్ మిరియాల పొడి: అర టీస్పూను
ఇలా చేయాలి
శనగపప్పును ఉడికించి, నీళ్లు వంపి, పక్కకు పెట్టుకోవాలి. తర్వాత బెల్లాన్ని కలిపి ముద్దగా అయ్యేలా కలుపుతూ ఉడికించాలి. ఆ మిశ్రమాన్ని మరింత మెత్తగా మిక్సీ పట్టాలి. దానికి మిరియాలు, యాలకుల పొడి కలుపుకొంటే పూర్ణం సిద్ధం. దీన్ని చిన్న ఉండలుగా చేసుకుని ఫ్రిజ్‌లో పెట్టుకోవాలి. చిన్న రోలులో కుంకుమ పువ్వును నూరుకోవాలి. మలాయ్ పేడా ముద్దకు దీన్ని కలిపి మోదకంలో సగానికి నింపాలి. మరో వైపు నుంచి పూర్ణం ముద్దను నింపి మోదకాన్ని మూసేస్తే పూర్ణం పోలీ రెడీ!
కావలసిన పదార్థాలు
డార్క్ చాకొలెట్: 100 గా., మిల్క్ చాకొలెట్: 50 గ్రా. మామిడి గుజ్జు : 50 గ్రా. రెడ్ చిల్లీ ఫ్లేక్స్ : 3గ్రా. ఎడిబుల్ గోల్డ్ డస్ట్ : 2 గ్రా.
ఇలా చేయాలి
పాన్‌లో మామిడి గుజ్జు వేడి చేయాలి. సిమ్‌లో ఉంచి డార్క్ చాకొలెట్, చిల్లీ ఫ్లేక్స్ కలిపి మెత్తగా అయ్యేదాకా ఉంచాలి. మరో గిన్నెలో మిల్క్ చాకొలెట్ వేసి, నీళ్లు పోసిన పాత్రలో ఈ గిన్నెను ఉంచి చాకొలెట్‌ను కరిగించుకోవాలి. ఈ ద్రవాన్ని మోల్డులో పోసి తిరిగి వంపేసి, ఆ మోల్డును ఫ్రిజ్‌లో ఉంచాలి. పదినిమిషాల తర్వాత బయటికి తీసి మామిడి గుజ్జు మిశ్రమాన్ని పైపింగ్ బ్యాగ్ సాయంతో నింపి మిగతా వైపు వైట్ చాకొలెట్‌తో మూసేయాలి. తర్వాత మళ్లీ రిఫ్రిజిరేట్ చేసుకుని మోల్డులను బయటికి తీసి, మోదక్ మీద గోల్డ్ డస్ట్ చల్లి వడ్డించడమే.