చిలగడ దుంపలు: నాలుగు
ఉల్లిగడ్డలు: మూడు
టమాటాలు: నాలుగైదు
జీడిపప్పులు: ఏడెనిమిది
కర్బూజా గింజలు: గుప్పెడు
ఎండు మిరపకాయలు: నాలుగు
నూనె: రెండు టేబుల్ స్పూన్లు
జీలకర్ర: పావు స్పూను
అల్లం వెల్లుల్లి ముద్ద: అరస్పూను
శనగపిండి: టేబుల్ స్పూను
మైదా: టేబుల్ స్పూను
ఉప్పు: తగినంత
పసుపు: చిటికెడు
దనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా: పావు స్పూను చొప్పున
కొత్తిమీర: నాలుగు రెబ్బలు
పనీర్: చిన్న ముక్క
ఉల్లిగడ్డలు కాస్త పెద్దవిగా తరిగి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. వీటితో పాటే వేయించిన ఎండు మిరపకాయలు కూడా వేసుకోవాలి. టమాటాలు కూడా మిక్సీ పట్టుకొని పక్కకు పెట్టుకోవాలి. జీడిపప్పు, కర్బూజా గింజలను రెండు గంటలు నానబెట్టుకొని తర్వాత పేస్ట్ చేసుకోవాలి. పొయ్యి మీద బాణలి పెట్టుకొని నూనెలో జీలకర్ర వేసి అందులో ఉల్లిగడ్డ ముద్ద, అల్లం వెల్లుల్లి ముద్ద కూడా వేసుకోవాలి.
టమాటా, కాజు పేస్ట్ కూడా వేసుకొని మగ్గనివ్వాలి. మరోవైపు, చిలగడదుంపల్ని ఆవిరి మీద ఉడికించి చెక్కుతీసుకొని మెదిపి ముద్దగా చేసుకోవాలి. ఇందులో శనగపిండి, మైదా, ఉప్పు, జీలకర్ర, దనియాల పొడి, గరం మసాలాలతో పాటు సన్నగా తరిగిన కొత్తిమీర, పసుపు కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ ముద్దను చిన్న ఉండలుగా చేసుకొని నూనెలో వేయించి పక్కకు పెట్టుకోవాలి. ఇందాక బాణట్లో తయారు చేసుకున్న గ్రేవీలో వీటిని వేసుకొని కాస్త పనీర్‌ను తురిమి పైన చల్లుకుంటే పరాఠాల్లోకి రుచికరంగా ఉండే
కోఫ్తా కర్రీ రెడీ!