కావలసిన పదార్థాలు
శనగపప్పు: ఒక కప్పు, పాలు: రెండున్నర కప్పులు, నెయ్యి: అర కప్పు, చక్కెర: ముప్పావు కప్పు, కోవా: పావు కప్పు, యాలకుల పొడి: ఒక టీస్పూన్, తరిగిన బాదం పప్పు: పావు కప్పు.
తయారీ విధానం
శనగపప్పును బాగా కడిగి రెండు గంటలపాటు నానబెట్టాలి. స్టవ్‌మీద కుక్కర్ పెట్టి.. నానబెట్టిన శనగపప్పు, పాలు పోసి మూతపెట్టి నాలుగు విజిల్స్ వచ్చేవరకు ఉడికించాలి. ప్రెషర్ పోయాక శనగపప్పును మెత్తగా మెదపాలి. స్టవ్‌మీద పాన్ పెట్టి పావు కప్పు నెయ్యి వేయాలి.వేడయ్యాక శనగపప్పు మిశ్రమం జోడించి సన్నని మంటపై కలుపుతూ వేయించాలి. ప్రతి ఐదు నిమిషాలకు రెండు టీస్పూన్ల నెయ్యి వేస్తూ బాగా వేయించాలి. నెయ్యి పైకి తేలేలా వేగిన మిశ్రమంలో కోవా, చక్కెర, యాలకుల పొడి వేసి దగ్గర పడేవరకు ఉడికించాలి. చివరగా తరిగిన బాదం చిలకరించి దించుకుంటే శనగపప్పు హల్వా సిద్ధం.