దోసకాయలు: మీడియం సైజువి రెండు
మామిడి పొడి: టేబుల్ స్పూను
పచ్చి మిరపకాయలు: నాలుగు
ఆవాలు, మెంతులు: అరటీస్పూను చొప్పున
పచ్చిశనగపప్పు, మినప్పప్పు: స్పూను చొప్పున
నూనె: రెండు టేబుల్ స్పూన్లు
ఇంగువ: కొద్దిగా, కొత్తిమీర: నాలుగు రెబ్బలు
పసుపు: చిటికెడు , ఉప్పు: తగినంత
ముందుగా దోసకాయల్ని కడిగి, చెక్కుతీసుకొని, చిన్నచిన్న ముక్కలుగా తరిగి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు బాణట్లో కొంచెం నూనె వేసి అందులో పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, మెంతులు వేసి వేయించాలి. అందులోనే పచ్చిమిరపకాయలు, ఇంగువ కూడా జోడించి తీసి పక్కకు పెట్టుకోవాలి. కాస్త చల్లారాక వీటిని మిక్సీలో వేసి కచ్చాపచ్చాగా పట్టి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు మూకుట్లో కొద్దిగా నూనె వేసి కాగాక, దోసకాయ ముక్కలు వేసి మూతబెట్టి కాసేపు మగ్గనివ్వాలి.
దోసకాయలతో పాటే కొద్దిగా కొద్దిగా మామిడి కాయ పొడిని కూడా వేసి కాస్త మగ్గనివ్వాలి. తర్వాత ఇందులోనే ఇందాక మిక్సీ పట్టి పెట్టికున్న మిశ్రమంతో పాటు, సన్నగా తరిగిన కొత్తిమీర, ఉప్పు, కొద్దిగా పసుపు కూడా వేసుకుని బాగా కలుపుకొంటే పుల్లపుల్లగా నోరూరించే మామిడిపొడి దోస పచ్చడి రెడీ. ఆవిర్లు కక్కే అన్నంతో నెయ్యికి జోడీగా దీన్ని రుచిచూసేయండి మరి!
(ఇందులోని పొడి కోసం.. మామిడి కాయను చెక్కు తీసి సన్నగా తురిమి బాగా ఎండబెట్టాలి. దాన్ని మిక్సీలో వేసి ఒక్క పట్టు పట్టి మళ్లీ ఎండబెట్టుకోవాలి. మరీ మెత్తటి పొడిగా కాకుండా కాస్త బరకగా ఉండేలాగా దీన్ని పట్టుకోవాలి. ఇది చింతపండు బదులుగా పచ్చళ్లు, పులిహోరల్లాంటి వివిధ వంటకాల్లో వాడుకోవచ్చు.)