కావలసిన పదార్థాలు:
మైదా: కప్పు
బియ్యప్పిండి: కప్పు
బొంబాయి రవ్వ: అరకప్పు
ఉల్లిగడ్డలు: అయిదారు
పచ్చిమిరపకాయలు: అయిదారు
కరివేపాకు: మూడు నాలుగు రెబ్బలు
అల్లం: అంగుళం ముక్క
ఇంగువ: చిటికెడు
నువ్వులు: రెండు స్పూన్లు
ఉప్పు: కావలసినంత
తయారీ విధానం:
ముందుగా మైదా, బియ్యప్పిండి, బొంబాయి రవ్వలను కలిపి పక్కన పెట్టుకోవాలి. ఉల్లిగడ్డలు పచ్చి మిరపకాయల్ని సన్నగా తరగాలి. అల్లాన్ని తురిమి ఉంచుకోవాలి. ఒక గిన్నెలోకి ఉల్లిగడ్డ ముక్కల్ని తీసుకొని అందులోనే తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు, అల్లం తురుము, ఇంగువ, నువ్వులు, ఉప్పు వేసి బాగా కలిపి పక్కకు పెట్టాలి. అలా ఒక 20 నిమిషాలు వదిలేయాలి. అప్పుడు ఆ ఉల్లిగడ్డ ముక్కల నుంచి కొద్దిగా నీరు వస్తుంది.
ఇందులో ఇందాక కలిపి పెట్టుకున్న రవ్వ పిండి మిశ్రమాన్ని వేసి తిరగకలపాలి. దీంతో వడలు చేసుకోగలిగేలా కాస్త గట్టి పిండి మిశ్రమం తయారవుతుంది. ఒక వేళ మరీ పొడిగా అనిపిస్తే కొద్దిగా నీళ్లు చల్లుకోవచ్చు. ఇప్పుడు ఆ పిండిని గుండ్రటి చిన్న చిన్న ఉండలుగా చేసుకుని అరచేతిలో పెట్టి వడల్లా వత్తాలి. వీటిని నూనెలో వేసి బాగా కాలాక తీస్తే కర్ణాటక స్పెషల్ మద్దూర్ వడ రెడీ అయినట్టే!
ఎం.బాలరాయుడు
పాకశాస్త్ర నిపుణురాలు