UPSC Results : ముంబై ఐఐటీలో చదువు.. ఆపై అంతర్జాతీయ కంపెనీలో ఐదంకెల జీతం. ఇవేవే అతడికి సంతృప్తిని ఇవ్వలేదు. ప్రజా సేవలో భాగం కావాలనే ఉద్దేశంతో జాబ్ మానేసి సివిల్స్‌కు సన్నద్ధమయ్యాడు. రెండు పర్యాయాలు ఇంటర్వ్యూ వరకు వెళ్లినా ర్యాంకు రాలేదు. అయినా నిరుత్సాహపడకుండా శ్రమించి.. విజేతగా నిలిచాడు హన్మకొండకు చెందిన పోతరాజు హరిప్రసాద్(P.Hari Prasad). మరింత పకడ్బందీగా చదివి నాలుగో ప్రయత్నంలో సివిల్స్‌లో 255వ ర్యాంక్ సొంతం చేసుకున్నాడు. ఐఏఎస్‌కు ఎంపికవ్వనున్న ఈ యంగ్‌స్టర్ తన జర్నీ గురించిన ఆసక్తికర విషయాలు ఇవి.
‘యూపీఎఎస్సీలో సివిల్స్ నా డ్రీమ్. అనుకున్నట్టే ఈసారి ర్యాంక్ సాధించాను. ఐఏఎస్‌కు ఎంపిక అవుతానని తెలిశాక మా అమ్మానాన్న ఆనందానికి అవధులులేవనుకో. నాన్న కిషన్ హన్మకొండలోని ప్రభుత్వ స్కూల్లో టీచర్. అమ్మ విజయ గృహిణి. పదో తరగతి వరకూ వరంగల్‌లోని ఆర్యభట్ట కాన్సెప్ట్ స్కూల్లో చదివాను. ఆ తర్వాత ఇంటర్మీడియట్ హైదరాబాద్. 2018 ఐఐటీ బాంబేలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేశాను. ఆ తర్వాత డైకిన్ (Daikin) ఎయిర్ కండీషనింగ్ కంపెనీలో ఉద్యోగం రావడంతో జపాన్ వెళ్లాను. అక్కడే ప్రధాన కార్యాలయంలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్(AI) రీసెర్చ్ రంగంలో చేశాను.
అక్కడ ఉన్నప్పుడే నాకు సివిల్స్ మీదకు మళ్లింది. ప్రజలకు దగ్గరగా ఉంటూ వాళ్ల సమస్యలకు పరిష్కారం చూపగల ఐఏఎస్ ఉద్యోగం సాధించాలనుకున్నా. మ్యాథమేటిక్స్ ఆప్షనల్ సబ్జెక్టుతో 2021లో ప్రిపరేషన్ ఆరంభించాను.
తొలి ప్రయత్నంలోనే ఇంటర్వ్యూకు అర్హత సాధించాను. కానీ, ర్యాంక్ రాలేదు. 2022లోనూ ఇంటర్వ్యూ వరకూ వెళ్లాను కానీ మళ్లీ ర్యాంక్ రాలేదు. అయినా సరే నిరుత్సాహపడలేదు. మూడో ప్రయత్నంలో ప్రిలిమ్స్‌లోనే వెనుదిరిగానే. కానీ, నాలుగోసారి ఏ పొరపాటు చేయలేదు. ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్.. ఇంటర్వ్యూ అన్నింటా అదరగొట్టాను. దాంతో, ఫలితాల్లో ఆలిండియా స్థాయిలో నాకు 255వ ర్యాంక్ వచ్చింది. నా విజయం పట్ల తల్లిదండ్రులు ఎంతో సంతోషిస్తున్నారు. ఐఏఎస్‌గా ఇనిస్టిట్యూషన్స్‌ను బలోపేతం చేయడమే నా లక్ష్యం. ముఖ్యంగా విద్యా, ఆరోగ్యం వంటి రంగాల్లో మార్పు తేవాలని అనుకుంటున్నా. సివిల్స్ సన్నద్ధత అనేది సుదీర్ఘమైన ప్రక్రియ. ఆత్మవిశ్వాసంతో ఉండాలి. పోటీని తట్టుకుంటూ.. స్మార్ట్‌గా ప్రిపేర్ అవ్వాలి. పాత ప్రశ్నాప్రత్రాలను తిరగేస్తూ ఉండాలి. పాజిటివ్‌గా ఉంటూ ప్రోత్సహించే స్నేహితులు ఉంటే.. మన ఆలోచనలు లక్ష్యం దిశగా సాగుతాయి’ అని వెల్లడించాడు.