food safety officer exam | నవంబర్ 7వ తారీఖున జరగనున్న ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఎగ్జామ్‌కి టీఎస్పీఎస్సీ అన్ని ఏర్పాట్లు చేసింది. మొత్తం 24 ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ పోస్ట్‌ల కోసం 16,381 మంది దరఖాస్తు చేసుకున్నారు. అయితే, 9,559 మంది అభ్యర్థులు మాత్రమే ఈరోజు వరకు హాల్‌టికెట్లు డౌన్లోడ్ చేసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 16 జిల్లాల్లో, 56 సెంటర్లలో ఈ పరీక్ష నిర్వహించనున్నారు. పేపర్-1, పేపర్-2 ఉంటాయి. రెండు విడతలుగా ఈ ఎగ్జామ్ జరగనుంది. ఉదయం 10 గంటల నుంచి, మధ్యాహ్నం 12:30 వరకు, మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష ఉంటుంది. ఈ సందర్భంగా అభ్యర్థులకు కొన్ని ముఖ్యమైన సూచనలు చేసింది టీఎస్పీఎస్సీ.
అభ్యర్థులు ఎగ్జామ్ రోజు కంటే ముందే హాల్‌టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలి. దాంతో పరీక్ష రోజు హడావిడి పడాల్సిన అవసరం ఉండదు. హాల్‌టికెట్‌లో చెప్పిన సూచనల్ని జాగ్రత్తగా చదవాలి. ఎగ్జామ్ సెంటర్ అడ్రస్, లొకేషన్ వంటివి ముందుగానే చూసుకోవాలి. దానివల్ల పరీక్ష టైం కంటే ముందు సెంటర్‌కి చేరుకోవచ్చు.
హాల్‌టికెట్ మీద ఫొటో సరిగ్గా ఉందో లేదో చూసుకోవాలి. ఫొటో సరిగ్గా లేనివాళ్లు రెండు పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలతో పాటు గెజిటెడ్ ఆఫీసర్ సంతకం చేయించిన డిక్షరేషన్ ఫామ్ తీసుకురావాలి. వాటిని చీఫ్ సూపరింటెండెంట్‌కి చూపించాలి. ఫొటో తీసుకోవడం,బయోమెట్రిక్ ఉంటుంది కాబట్టి మొదటి సెషన్ వాళ్లను ఉదయం 8 గంటల నుంచి 9:15 వరకు ఎగ్జామ్ సెంటర్లోకి అనుమతిస్తారు. రెండో సెషన్ వాళ్లను మధ్యాహ్నం 1:15 నుంచి 1:45 వరకు సెంటర్లోకి అనుమతిస్తారు. అభ్యర్థులు ఎగ్జామ్ సెంటర్‌కి పెన్ను, ఫోన్లు, ట్యాబ్లెట్స్, పెన్‌డ్రైవ్, బ్లూటూత్ డివైజ్, వాచీ, కాలిక్యులేటర్ వంటి ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు తీసుకొని రావొద్దు. పర్స్, నోట్స్, చార్ట్‌లు, విడిపేపర్స్, రికార్డింగ్ పరికరాలకు అనుమతి ఉండదు. ఒకవేళ ఎవరిదగ్గరైనా మొబైల్ ఫోన్ లేదా ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ దొరికితే వాళ్లపై చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. వాళ్లను డిబార్ చేసే అవకాశం ఉంది.
హాల్‌టికెట్‌తో పాటు వెరిఫికేషన్ కోసం ఒరిజినల్ ఐడెండిటీ కార్డ్ (పాస్‌పోర్ట్, పాన్‌కార్డ్, ఆధార్ కార్డ్, ఎంప్లాయి ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్.. వీటిలో ఏదో ఒకటి) తీసుకెళ్లాలి. ఐడీ కార్డ్ ఫొటో కాపీ లేదా స్కాన్ కాపీని అనుమతించరు. అభ్యర్థులు బ్లూ లేదా బ్లాక్ బాల్ పాయింట్ పెన్ తీసుకెళ్లాలి. అభ్యర్థులు పరీక్ష జరుగుతున్నప్పుడు మల్టిపుల్ ఛాయిస్ సమాధానాల్ని గుర్తించేందుకు కంప్యూటర్ మౌస్‌ని మాత్రమే ఉపయోగించాలి. కేటాయించిన కంప్యూటర్ లాగిన్ స్క్రీన్ మీద అభ్యర్థుల ఫొటో, పేరు కనిపిస్తాయి. తమ పేరు, ఫొటో సరిగ్గా ఉందా? లేదా? అనేది సరి చూసుకోవాలి. ఒకవేళ ఫొటో, పేరు సరిగ్గా లేకుంటే ఇన్విజిలేటర్‌కి చెప్పాలి.
పరీక్ష మొదలవడానికి 10 నిమిషాల ముందు మాత్రమే లాగిన్ ఐడీ, పాస్వర్డ్ చెప్తారు. పరీక్ష ముగిసేంత వరకు అభ్యర్థుల్ని సెంటర్ నుంచి బయటికి వెళ్లేందుకు అనుమతించరు. ఎగ్జామ్ హాల్ నుంచి బయటకి వచ్చే ముందు రఫ్ వర్క్ షీట్లను ఇన్విజిలేటర్‌కి అప్పగించాలి. హాల్‌టికెట్ మీద టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో ఇచ్చిన సూచనల్ని అభ్యర్థులు జాగ్రత్తగా చదవాలి. పరీక్షా కేంద్రంలో సూచనల్ని ఉల్లఘించేలా ప్రవర్తించిన వాళ్లపై క్రమశిక్షణ చర్యలకు బాధ్యులవుతారు. అంతేకాదు భవిష్యత్‌లో టీఎస్పీఎస్సీ, దేశంలోని మిగతా పబ్లిక్ సర్వీస్ కమిషన్లు నిర్వహించే పరీక్షలు రాయకుండా వాళ్లపై నిషేధం విధిస్తారు.