Zubeen Garg | ప్రముఖ అస్సామీ గాయకుడు, సంగీత దర్శకుడు జుబీన్ గార్గ్(52) అంతిమయాత్ర అరుదైన రికార్డు సృష్టించింది. గార్గ్ అంత్యక్రియలు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్నాయి. అసోం రాజధాని గువహటిలో నిర్వహించిన జుబీన్ గార్గ్ అంతిమయాత్రకు అభిమానులు లక్షలాది సంఖ్యలో తరలివచ్చి నివాళులర్పించారు. స్థానిక అర్జున్ భోగేశ్వర్ బారువా స్పోర్ట్స్ కాంప్లెక్స్ గార్గ్ పాటలతో మార్మోగిపోయింది. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. మైఖేల్ జాక్సన్, పోప్ ఫ్రాన్సిస్, క్వీన్ ఎలిజబెత్-2ల అంతిమయాత్రల తర్వాత అత్యధిక మంది పాల్గొన్న అంతిమయాత్రగా లిమ్కా బుక్ ఆఫ్ రికార్డుల్లోకి ఎక్కింది.
జుబీన్ గార్గ్ సింగపూర్‌లో స్కూబా డైవింగ్ సందర్భంగా చోటుచేసుకున్న ప్రమాదంలో దుర్మరణం చెందిన సంగతి తెలిసిందే. అస్సామీతో పాటు బెంగాలీ, హిందీ భాషల్లో ఆయన గాయకుడిగా, స్వరకర్తగా మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. హిందీ చిత్రం ‘గ్యాంగ్‌స్టర్’ (2006)లో ఆయన ఆలపించిన ‘యా ఆలీ…’ పాట దేశవ్యాప్తంగా సంగీతప్రియుల్ని అలరించింది. ‘క్రిష్-3’ ‘ప్యార్ కే సైడ్ ఎఫెక్ట్స్’ చిత్రాల్లో ఆయన పాడిన పాటలకు మంచి పేరొచ్చింది.
మేఘాలయాలోని తురా నగరంలో జన్మించారు జుబీన్గార్గ్. బాల్యం నుంచే సంగీతంపై మక్కువ ప్రదర్శించే ఆయన 1992లో ‘అనామికా’ అనే అస్సామీ ఆల్బమ్ ద్వారా సంగీత ప్రయాణం ప్రారంభించారు. అనంతరం హిందీ, బెంగాలీ ఇండస్ట్రీల్లో అడుగుపెట్టి పలు విజయవంతమైన చిత్రాలకు పనిచేశారు. అస్సామీ, బెంగాలీ, నేపాలీతో పాటు 40 భాషల్లో వివిధ యాసల్లో పాటలు పాడి ప్రతిభావంతుడిగా పేరు తెచ్చుకున్నారు. ముఖ్యంగా నార్త్ఈస్ట్ రాష్ర్టాల్లో ఆయనకు తిరుగులేని ఫాలోయింగ్ ఉంది.