‘దేశసంస్కృతినీ, జాతి ఔన్నత్యాన్ని, మాతృభాష గొప్పతనాన్ని ప్రపంచానికి చాటిన మహనీయుల స్మారక చిహ్నాలను ఏర్పాటు చేయడంలో.. జయంతులు, వర్థంతులు జరుపుకోవడంలో అంతరార్థం.. ఆధునికత వైపు పరుగులు తీస్తున్న నేటి తరానికి వారి ఔన్నత్యాన్ని గుర్తు చేయడమే. నేడు అన్న నందమూరి తారకరామారావు జయంతి. తెలుగుజాతి గొప్పతనాన్ని ప్రపంచానికి చాటిన మహనీయుల్లో అన్న ఎన్టీఆర్ అగ్రగణ్యుడు.
ఆయన గొప్పతనాన్ని ముందు తరాలకు తెలియజేయాల్సిన బాధ్యత మనందరిది’ అని ఎన్టీఆర్ వీరాభిమాని, ప్రముఖ దర్శకుడు వైవీఎస్ చౌదరి అన్నారు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, మహానటుడు స్వర్గీయ నందమూరి తారకరామారావు జయంతి సందర్భంగా వైవీఎస్ చౌదరి ‘నమస్తే తెలంగాణ’తో ప్రత్యేకంగా ముచ్చటించారు. ఇంకా చెబుతూ ‘నా పరిపూర్ణ పరిశుద్ధ హృదయంతో నిరంతరం అన్న ఎన్టీఆర్‌ని స్మరించుకుంటూనే ఉంటాను.
ఎన్టీఆర్ అభిమానిగా పుట్టడం ఒక వరం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్టీఆర్ అభిమానులందరి చేత వీరాభిమానిగా కొనియాడబడటం ఇంకా గొప్పవరం. ఆయన్ను కలవగలగడం, కలిసి ప్రయాణించగలగడం మహద్భాగ్యం. ఏ రంగంలో ఆయన ఆరాధింపబడ్డారో, అదే రంగంలో గుర్తింపు తెచ్చుకోవడం పూర్వజన్మ సుకృతం. ఇవన్నీ నాకు మాత్రమే దక్కిన అదృష్టాలు. ఇంతటి అదృష్టాన్ని ప్రసాదించిన దైవానికి ఎల్లవేళలా రుణగ్రస్తుడనే’ అని వైవీఎస్ చౌదరి పేర్కొన్నారు.