‘ఎన్టీఆర్ యుగపురుషుడు. కారణజన్ముడు. అలాంటి వారు ఓ మహత్తర కార్యం కోసం దివి నుంచి భువికి వస్తారు. జీవితాన్ని సాఫల్యం చేసుకొని, కోట్ల మందికి ఆదర్శప్రాయులై మరలా దివికేగుతారు. నేడు ఎన్టీఆర్ భౌతికంగా మన మధ్య లేకున్నా ఆయన చూపించిన మార్గం సదా అనుసరణీయం. తెలుగు భాష, జాతి ఉన్నంతకాలం ఆయన చిరస్మరణీయుడిగా నిలిచిపోతారు’ అన్నారు .
ప్రముఖ దర్శకుడు వై.వి.యస్. చౌదరి. నేడు విశ్వవిఖ్యాత నటుడు నందమూరి తారక రామారావు 29వ వర్ధంతి. ఈ సందర్భంగా వై.వి.యస్.చౌదరి మాట్లాడుతూ ‘ఎన్టీఆర్ కేవలం నటుడిగానే కాదు, దర్శకుడిగా, రాజకీయ వేత్తగా కోట్ల మందిలో స్ఫూర్తినింపారు. తెలుగు నేలపై రాజకీయ చైతన్యాన్ని తీసుకొచ్చి ప్రజల జీవితాల్లో వెలుగుల్ని నింపారు.
ఎందరికో రాజకీయ జీవితాన్ని ప్రసాదించారు. పురాణ పాత్రలకు వెండితెరపై సజీవరూపంలా నిలిచి భారతీయ హైందవ సంస్కృతి ఔన్నత్యాన్ని చాటారు. సాధారణ కార్మికుల నుంచి సైంటిస్టుల వరకు ఆయన అందరికి స్ఫూర్తిప్రదాతగా నిలిచారు. నటుడిగా, రాజకీయవేత్తగా, తెలుగు భాష, విలువల పరిరక్షకుడిగా తెలుగు జాతికి మార్గదర్శకుడిగా నిలిచారు. ఓ వ్యక్తి తన జీవితకాలంలో ఇన్ని కార్యాల్లో సాఫల్యత సాధించడం అరుదైన విషయం. అది కారణజన్ములకే సాధ్యం. అలాంటి మహాపురుషుడి వర్ధంతి రోజున ఆయన పేరుని స్మరించుకోవడం పూర్వజన్మ సుకృతంలా, మహాద్భాగ్యంగా భావిస్తున్నా’ అన్నారు.