Shashtipoorthi | టాలీవుడ్ యువ దర్శకుడు పవన్ ప్రభ దర్శకత్వంలో యువ కథానాయకుడు రుపీష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘షష్టి పూర్తి(Shashtipoorthi). ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తిచేసుకోగా.. ఈ చిత్రం మే 30వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమాకు సంగీత సామ్రాట్ ఇళయరాజా సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే మూవీ నుంచి రెండు పాటలను విడుదల చేయగా.. ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. అయితే తాజాగా ఈ మూవీకి సంబంధించి మరో ఆసక్తికర విషయం తెలిసింది. ఈ సినిమా కోసం ఇళయరాజా(Isaigani Ilayaraaja) మొట్టమొదటిసారి తన కొడుకు యువన్ శంకర్ రాజా(Yuvan Shankar Raaaja)తో తెలుగు పాట పాడించినట్లు తెలుస్తుంది. కాగా.. ఈ పాట త్వరలోనే విడుదల కాబోతున్నట్లు సమాచారం.
‘షష్టి పూర్తి’ చిత్రం ఆహ్లాదకరమైన కథాంశంతో తెరకెక్కినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలోని ముఖ్యమైన సన్నివేశాలను రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో, గోదావరి నదీ తీర ప్రాంతాల యొక్క సహజమైన అందమైన లొకేషన్లలో చిత్రీకరించారు. టాలీవుడ్లో తమదైన ముద్ర వేసిన సీనియర్ నటులు రాజేంద్ర ప్రసాద్, అర్చన ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఒకప్పుడు ‘లేడీస్ టైలర్’ వంటి సూపర్ హిట్ చిత్రంలో కలిసి నటించిన ఈ జంట మళ్లీ ఈ సినిమా ద్వారా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ చిత్రానికి రామ్ రెడ్డి ఛాయాగ్రహణం అందిస్తుండగా, ప్రముఖ నిర్మాణ సంస్థ మా AAIE ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.