Ravi Teja | సినిమా రంగంలో గత కొన్నేళ్లుగా బయోపిక్‌లు ట్రెండ్‌గా మారాయి. ప్రముఖుల జీవిత కథలను తెరపై చూపిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు దర్శకులు. ‘మహానటి’ సావిత్రి బయోపిక్‌తో దర్శకుడు నాగ్ అశ్విన్ బ్లాక్‌బస్టర్ హిట్ సాధించిన తర్వాత తెలుగులో పలు బయోపిక్‌లు వచ్చినా, అవి ఆ స్థాయిలో విజయం సాధించలేదు. అయితే ఈ టాపిక్ మళ్లీ చర్చల్లోకి రావడానికి కారణం యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ . తాజాగా తన సినిమా ‘తెలుసు కదా’ ప్రమోషన్స్‌లో భాగంగా సిద్ధు, మాస్ మహారాజ రవితేజ తో ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రవితేజపై తన అభిమానాన్ని వ్యక్తం చేశారు.
ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా అసిస్టెంట్ డైరెక్టర్‌గా మొదలై, చిన్న పాత్రల నుంచి హీరోగా ఎదిగిన రవితేజ గారి జర్నీ నాకు చాలా ఇన్స్పైరింగ్గా అనిపించింది. అందుకే ఆయన బయోపిక్ చేయాలని ఒకప్పుడు సీరియస్‌గా ప్లాన్ చేశాను అని సిద్ధు తెలిపారు. తన సినిమా ‘కృష్ణ అండ్ హీజ్ లీలా’ తర్వాత రవితేజ బయోపిక్ స్క్రిప్ట్‌పై కొంతకాలం పని చేశానని, కానీ కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్‌ను ఆపివేశానని చెప్పారు. సిద్ధు మాటలు విన్న రవితేజ కూడా బయోపిక్‌లపై తన అభిప్రాయాన్ని వెల్లడించారు. మన దగ్గర బయోపిక్‌లు ఎక్కువగా పాజిటివ్ కోణంలోనే చూపిస్తారు. కానీ ఒక మనిషి జీవితాన్ని నిజంగా చూపాలంటే, అతనిలోని నెగెటివ్ సైడ్‌ను కూడా చూపించాలి. అప్పుడు మాత్రమే అది రియల్‌గా అనిపిస్తుంది అని రవితేజ అన్నారు.
అంతేకాక, తాను కూడా ఒక నటుడి బయోపిక్ తీసే ఆలోచనలో ఉన్నానని చెప్పినా, ఆ నటుడు ఎవరో మాత్రం రహస్యంగా ఉంచారు రవితేజ. ఇకపోతే ఈ ఇద్దరు నటుల తాజా సినిమాలు ఈ నెలలోనే థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. సిద్ధు జొన్నలగడ్డ నటించిన ‘తెలుసు కదా’ అక్టోబర్ 17న విడుదల కానుంది. నీరజ కోన దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో రాశీ ఖన్నా, శ్రీనిధి శెట్టి హీరోయిన్లుగా నటించారు. మరోవైపు రవితేజ నటించిన ‘మాస్ జాతర’ అక్టోబర్ 31న ప్రేక్షకుల ముందుకు రానుంది.