Disha Patani | బాలీవుడ్ నటి దిశా పటానీ ఇంటి ముందు చోటుచేసుకున్న కాల్పుల ఘటన ప్రస్తుతం సంచలనం సృష్టిస్తోంది. ఈ ఘటనపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వ్యక్తిగతంగా స్పందించారు. దిశా కుటుంబానికి ఫోన్ చేసి భద్రత కల్పించడమే కాకుండా, కాల్పులకు కారణమైన నిందితులను త్వరలోనే అరెస్టు చేస్తామంటూ భరోసా ఇచ్చారు. ఈ విషయాన్ని దిశా తండ్రి జగదీష్ పటానీ స్వయంగా మీడియాతో వెల్లడించారు.యోగి ఆదిత్యనాథ్ గారు మాకు స్వయంగా ఫోన్ చేశారు. మాకు ధైర్యం చెప్పారు. ఈ కేసులో ఎటువంటి నిర్లక్ష్యం వహించమని అధికారులకు స్పష్టంగా ఆదేశించారు. నిందితులను ఎక్కడున్నా పట్టుకుంటాం అని హామీ ఇచ్చారు. మాకు పూర్తి భద్రతను కల్పిస్తానని స్పష్టం చేశారు,” అని ఆయన తెలిపారు.
సెప్టెంబర్ 12న ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ పట్టణంలో దిశా పటానీ నివాసం ముందు గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులకు పాల్పడ్డారు. ఈ ఘటన స్థానికులను తీవ్ర భయాందోళనకు గురిచేసింది. తాజా సమాచారం ప్రకారం, ఈ దాడి వెనక కారణం దిశా సోదరి ఖుష్బూ పటానీ చేసిన వ్యాఖ్యలు అని తెలుస్తోంది. ఓ వర్గ మనోభావాలను దెబ్బతీసేలా ఆమె మాట్లాడడంతో దాడి చేశారని అంటున్నారు. చాలా మంది యూజర్లు గోల్డీ బ్రార్, రోహిత్ గోదారాను గుర్తు చేస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు, ఎస్ఎస్పీ, ఏడీజీ స్థాయి అధికారులు స్వయంగా దర్యాప్తు చేస్తున్నారని కూడా దిశా తండ్రి జగదీష్ తెలిపారు.
గోల్డీ బ్రార్, రోహిత్ గొదారా ఈ కాల్పులు తమ పనేనన్నారు. మతపరమైన మనోభావాలను దెబ్బతీసినందుకు ఇలా చేయాల్సి వచ్చిందంటూ ఒక సందేశం కూడా విడుదల చేశారు. ఇది కేవలం ట్రైలర్ మాత్రమేనని.. భవిష్యత్‌లో మతాన్ని, సాధువులను అవమానిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరికలు జారీ చేశారు. అయితే, దీని వెనుక ఎవరున్నారో పోలీసులు ఇంకా స్పష్టం చేయలేకపోయారు. రీసెంట్గా దిశా సోదరి తాను అనిరుద్ధాచార్యపై మాత్రమే కామెంట్స్ చేశానని.. ప్రీమానంద్ మహారాజ్‌పై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని క్లారిటీ ఇచ్చారు. దిశా సోదరి ఖుష్బూ పటానీ మాజీ ఆర్మీ అధికారిణి. ప్రస్తుతం ఆమె ఒక ఫిట్నెస్ ట్రైనర్‌గా పనిచేస్తున్నారు. ఆమె చేసిన కొన్ని వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ పరిణామాలు చోటుచేసుకున్నట్లు సమాచారం.