సినీ పరిభాషలో పెళ్లంటే… మూడే ముళ్లు.. ఏడే అడుగులు.. మొత్తం కలిపి నూరేళ్లు! ప్రేమకథలే కాదు.. పెళ్లి ముచ్చట్లు కూడా సినీ పండితులకు కథావస్తువే! ఆలుమగల అన్యోన్యతకు కొన్ని సినిమాలు పట్టం కడితే.. పెళ్లి గొప్పదనాన్ని మరికొన్ని చిత్రాలు రుజువు చేశాయి.. భర్తంటే భరించేవాడు కాదని, భార్యంటే బానిస కాదని నిరూపించినవీ ఉన్నాయి. ఏం చెప్పినా, ఎలా చూపించినా.. వెండితెర పెళ్లి కథలన్నీ శుభం కార్డుతో ముగిసినవే! వివాహ బంధం పవిత్రతను చాటిచెప్పినవే!!
World Marriage Day | ఐదు రోజుల పెళ్లి.. అమ్మంటి పెళ్లి… తొలి చూపులే లేని.. తెలుగింటి పెళ్లి.. ‘వరుడు’ సినిమా కోసం వేటూరి రాసిన ఐదు రోజుల పెళ్లి పాట ఇది. ఈ పాట వింటే.. వివాహ మహోత్సవం ఇంత రంజుగా ఉంటుందా అనిపిస్తుంది. పెళ్లి తంతు వివాహ భోజనంబు కన్నా వింతైనదనిపిస్తుంది.
పాట గొప్పదనం అటుంచితే.. ‘వరుడు’ పెళ్లీడుకొచ్చిన వాళ్లందరికీ ఆదర్శం అనిపిస్తాడు. కలెక్షన్ల పరంగా సినిమా అంతగా ఆడకున్నా.. ‘వరుడు’ ఇచ్చిన సందేశం ఏ తరం వాళ్లయినా మెచ్చే విధంగానే ఉంటుంది.
మూడు ముళ్లు పడకుండానే, ఏడు అడుగులు వేయకుండానే.. భర్త బాధ్యత ఏమిటో చాటి చెప్పిన సినిమా ‘వరుడు’. తెర చేలం వెనుక తనను ఆత్రంగా వెదికిన అమ్మాయి చూపులు.. తన కళ్లతో కలవగానే ‘నాతి చరామి’ అనుకుంటాడా హీరో! తనకు కాబోయిన భార్యను ఎవరో ఎత్తుకెళ్తే.. సాహసించి తన ఇల్లాలిని కాపాడుకుంటాడు.
కథాపరంగా ‘వరుడు’ ఇంతే కావొచ్చు. కథనం పరంగా కాస్త గడబిడగా అనిపించొచ్చు. ఆ సినిమా మాత్రం ఓ ఉపదేశం. తనను నమ్మి వచ్చిన వధువు పట్ల వరుడు ఎంత బాధ్యతగా ఉండాలో చెబుతుంది. గుణశేఖర్ దర్శకత్వంలో అల్లు అర్జున్, భానుశ్రీ మెహ్రా జంటగా నటించిన ‘వరుడు’ విలువలు నేర్పుతుంది.
పెళ్లయిన కొత్తలో.. అన్నీ వింతగానే ఉంటాయి. విసురుగా కసిరినా చొరవగానే అనిపిస్తుంది. కానీ, కాలం గడిచేకొద్దీ ఇద్దరి మధ్యా సఖ్యతను చెరిపే ప్రతికూలతలు ఎదురుపడతాయి. ఎవరో ఒకరు తగ్గకుంటే.. సంసారాన్ని నెగ్గుకురావడం కష్టం. ఇలాంటి సందర్భాలు ఎదురైనప్పుడు పారిపోవద్దు. ‘పెళ్లి పుస్తకం’లో ఆరుద్ర వారు సెలవిచ్చినట్టు.. ‘అడుగడుగున తొలి పలుకులు గుర్తుచేసు’కుంటే సరిపోతుంది. అప్పుడు ‘త్వరపడినా.. పొరబడినా.. తప్పు దిద్దుకో’వచ్చు. ‘పెళ్లి పుస్తకం’ చెప్పిందీ ఇదే! ఒకే చోట పనిచేసే భార్యాభర్తలు. ఆలుమగలం అని చెప్పుకోలేని పరిస్థితి. ఎవరి బాధ్యతలు వాళ్లవి. అయినా ఒకరంటే ఒకరికి వల్లమాలిన ప్రేమ.
ఇలాంటి పరిస్థితుల్లో పడ్డ నాయికానాయకులు ఓ దశ వరకూ బాగానే నెట్టుకొస్తారు! చూస్తుండగానే పరిస్థితులు చేజారిపోతాయి. దిద్దుకోలేనంత పెద్ద తప్పుగా పరిణమిస్తున్న తరుణంలో.. ఒకరినొకరు తెలుసుకొని ఒడుదొడుకులు తట్టుకుంటారు. అమ్ముకుట్టి అంతరంగం గ్రహిస్తాడు కిట్టమూర్తి. కిట్టమూర్తి మనసు తెలుసుకుంటుంది అమ్ముకుట్టి. కథ సుఖాంతం. ప్రేక్షకులకు వినోదంతోపాటు సంసార సూత్రమూ అందుతుంది. ముళ్లపూడి రాత, బాపూ చేతతో రూపుదిద్దుకున్న ‘పెళ్లి పుస్తకం’ నవజంటలకే కాదు, సిల్వర్ జూబ్లీ సెలెబ్రేషన్ చేసుకున్న దంపతులకూ పవిత్ర గ్రంథం.
అచ్చట్లు, ముచ్చట్లు కొంగుముడి వేసుకున్న కొత్త దంపతులకే కాదు ముదిమి జంటకూ ఉంటాయని నిరూపించిన చిత్రం ‘మిథునం’. అప్పదాసుకు తిండి యావ. పైగా విపరీతమైన కోపం. బుచ్చిలక్ష్మి మహా తెలివైంది. భర్త పైత్యానికి విరుగుడు తెలిసిన ఇల్లాలు. ఆయన కోపాన్ని చల్లార్చే ప్రేమ గుళికలు ఆమె దగ్గర ఎన్నో ఉన్నాయి. ఆయనగారు శ్రుతిమించిన వేళ ‘ద్రాక్షారం సంబంధం కుదిరితేనా..’ అనేసి ఉడికించడమూ ఆమెకు రివాజు. ‘అమ్మి తిట్లకు ఓర్చుకుంటావు కానీ, పొగడ్తలకు పొంగిపోవు కదా’ అని అంతటి తిక్క అప్పదాసు కితాబిచ్చాడంటే.. ఆయన్ను ఈవిడ ఎంతగా కొంగున కట్టుకుందో తెలిసిపోతుంది.
శ్రీరమణ రచించిన ‘మిథునం’ కథ ఆధారంగా తనికెళ్ల భరణి దర్శకత్వంలో వచ్చిన ‘మిథునం’ ఆదిదంపతులు అభిమానించే ముచ్చటైన చిత్రం అనిపించుకుంది. కేవలం రెండే పాత్రలతో సినిమా నడిపించిన తీరు అపురూపమే! అప్పదాసుగా ఎస్పీ బాలు, బుచ్చిలక్ష్మిగా లక్ష్మి నటన ప్రతి సన్నివేశంలోనూ శిఖరాయమానంగా అలరిస్తుంది. సినిమాగా చూస్తే ‘మిథునం’ వినోదాన్ని పంచుతుంది. చివరికి విషాదాన్నీ రుచి చూపిస్తుంది. లోతుగా చూస్తే, జంట పాత్రల మాటలను మనసుతో వింటే.. సంసారం సాగరం అనిపించదు. బృందావనిలోని యమునలా అలరిస్తుంది. ప్రతీ రాత్రి వసంత రాత్రిగా మలుచుకోవడం ఇంత తేలికా అనిపిస్తుంది.
పెళ్లి కథలు తెరమరుగవుతున్న వేళ వివాహ బంధం విలువను చాటి చెప్పిన సినిమా ‘శ్రీనివాస కళ్యాణం’. స్నేహితుల బలవంతం మీద ‘చోలీ కే పీఛే క్యా హై’ పాటకు వరుడు డ్యాన్స్ చేశాడని ఇటీవల ఓ ఆడపిల్ల తండ్రి పీటల మీద పెళ్లి నిలిపేశాడు. కూతురు బతిమాలినా.. ‘ఈ అబ్బాయి మనకు సెట్ కాడు’ అని పెళ్లి క్యాన్సిల్ చేశాడు. అసలు పెళ్లంటే.. ఇచ్చిపుచ్చుకునే కట్నాలు కాదు. వేద మంత్రాల సాక్షిగా జరిగే పుణ్యక్రతువు. ఈ పవిత్ర కార్యాన్ని ఒప్పందంగా మార్చాలని భావిస్తాడు హీరోయిన్ తండ్రి. అతనికి పెళ్లి గొప్పదనాన్ని చాటి చెప్పాలనుకుంటాడు హీరో! అందుకే పెళ్లిలో జరిగే ప్రతి అంకాన్నీ సలక్షణంగా చిత్రీకరించి కలర్‌ఫుల్ ఫెస్టివల్‌గా ‘శ్రీనివాస కళ్యాణం’ సినిమాను తీర్చిదిద్దాడు దర్శకుడు వేగేశ్న సతీష్. కొట్నం నుంచి అప్పగింతల వరకు పెళ్లిలో జరిగే ప్రతి సందర్భాన్నీ హృద్యంగా తెరకెక్కించాడు. నితిన్, రాశీ ఖన్నా జంటగా వచ్చిన ఈ సినిమా 2018లో విడుదలై మంచి కలెక్షన్లే రాబట్టింది. పెళ్లి గొప్పదనం చాటినందుకు అందరి మన్ననలూ అందుకుంది.
ఒప్పందం పెళ్లి కథావస్తువుగా తెరకెక్కిన మరో సినిమా ‘పవిత్ర బంధం’. సౌందర్య, వెంకటేశ్ నాయికానాయకులుగా నటించిన ఈ చిత్రం సెన్సేషనల్ హిట్ సాధించింది. ఆధునిక పోకడతో ఆలిని ఉద్యోగిగా భావించిన భర్త, స్వాభిమానం కలిగిన ఓ భార్య కథ ఇది. ఫ్యామిలీ ఆడియెన్స్‌ను కట్టిపారేయడంలో సిద్ధహస్తుడైన ముత్యాల సుబ్బయ్య దర్శకుడు. ఇంకేముంది సబ్జెక్టుకు తగ్గట్టుగా సన్నివేశాలు బలంగా పండాయి. పెళ్లంటే అగ్రిమెంట్ అనుకున్న హీరోకు కనువిప్పు కలగడం, ఆమె బెట్టు చేయడం, ఇద్దరి మధ్యా సయోధ్య కుదరడం చకచకా జరిగిపోతాయి. సినిమా చూసిన ప్రేక్షకులకు బాగానే గిట్టుబాటు అయింది. అంతర్లీనంగా భార్యాభర్తల అనురాగం ఎలా ఉండాలో ‘పవిత్ర బంధం’ చెబుతుంది. ఆ సినిమాలో ఓ పాటలో ‘ఏ స్వార్థమూ లేని త్యాగం భార్యగా రూపమే పొందగా’ అన్న మాటలోని సత్యాన్ని గ్రహిస్తే.. ‘పవిత్ర బంధం’ శాశ్వత అనుబంధంగా మిగిలిపోతుంది.
వేదమంత్రాలు, మంగళ వాద్యాలు, బంధువుల ఆశీర్వాదాల మధ్య జరిగే ఉత్సవం కల్యాణం. కానీ, విడాకులు మాత్రం కోర్టు నాలుగు గోడల మధ్య సంతకాలతో అయిపోతాయి. ఎందరి మధ్య తనకు తాళి కట్టాడో, అందరి మధ్యా తెగదెంపులు చేసుకోవాలని న్యాయవ్యవస్థకే సవాలు విసిరిన చిత్రం ‘ఆహ్వానం’. ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో శ్రీకాంత్, రమ్యకృష్ణ హీరో హీరోయిన్లు. నలుగురిలో విడాకులు ఇవ్వడానికి సిద్ధపడ్డ భర్తకు సినిమా పతాక సన్నివేశంలో మాంగల్యం పవిత్రతను చాటి చెబుతుంది భార్య. వివాహ బంధం ఎంత గొప్పదో వివరిస్తుంది. తన తప్పు తెలుసుకొని భర్త మారడం సినిమాలో సహజం. అతణ్ని ఆమె అంగీకరించడం అంతే సులభం కావొచ్చు. కానీ, చిన్నాచితకా కారణాలకే కోర్టు మెట్లు ఎక్కుతున్న నేటి జంటలకు ‘ఆహ్వానం’ కనువిప్పే!
టాకీ చిత్రాలు మొదలైన నాటి నుంచి పెళ్లి సినిమాలు తరచూ ప్రేక్షకులను పలకరించాయి. విజయవంతం అయ్యాయి. అయితే, అప్పట్లో చాలా కథలు ‘పెళ్లి’తో సుఖాంతం అయ్యేవి. ‘పెళ్లి’తో మొదలైన సినిమాలు అరుదనే చెప్పాలి. అక్కినేని, జమున జంటగా నటించిన ‘పెళ్లినాటి ప్రమాణాలు’ సూపర్ హిట్ చిత్రం. ఇందులో జీవితంలో ఎలా ఉండాలో భార్యాభర్తలు ఇద్దరూ పెళ్లినాడు ప్రమాణాలు చేసుకుంటారు. చాలా కాలం ఆ ప్రమాణాలు పాటిస్తూ ఆదర్శంగా కాలం గడుపుతారు. కానీ, ముగ్గురు పిల్లలు కలిగాక.. భార్య తనను అంతగా పట్టించుకోవడం లేదని పక్కచూపులు చూస్తాడు భర్త. చివరికి భార్యను మించిన బంధువు లేదని హీరో తెలుసుకోవడంతో సినిమా ముగుస్తుంది. ఈ సినిమా కూడా వివాహ బంధం ఎంత గొప్పదో చాటి చెబుతుంది.
భార్యకు సుఖం పంచలేని ఓ భర్త కథ ‘సుమంగళి’. అక్కినేని, సావిత్రి నటించిన ఈ సినిమా అప్పట్లో ఓ సంచలనమే! హీరోహీరోయిన్లు ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. ఓ ప్రమాదం కారణంగా హీరో సంసారానికి పనికిరాకుండా అవుతాడు. వయసులో ఉన్న భార్య ముచ్చట తీర్చలేకపోతున్నానే అని ఆవేదనలో కూరుకుపోతాడు. ఆమెకు మళ్లీ పెళ్లి చేసి తన ప్రేమను చాటుకోవాలని భావిస్తాడు. భర్త ఉద్దేశాన్ని గ్రహించిన ఆమె.. ఆత్మహత్యకు పూనుకుంటుంది. సరిగ్గా యాభై ఏండ్ల కిందట వచ్చిన ఈ సినిమా అప్పటి సామాజిక పరిస్థితుల్లో అలా విషాదాంతమైంది. కానీ, ఆ హీరో త్యాగం మాత్రం ఆనాటికీ, ఈనాటికీ ఆదర్శమే!