Salman Khan | బాలీవుడ్ స్టార్ నటుడు సల్మాన్ ఖాన్ (Salman Khan) ఇంటి వద్ద ఇటీవలే కాల్పుల (firing) ఘటన కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు దర్యాప్తును ముమ్మరంగా సాగిస్తున్నారు. ఇందులో భాగంగా కాల్పుల ఘటనపై సల్మాన్ ఖాన్, అతడి సోదరుడు అర్బాజ్ ఖాన్ వాంగ్మూలాలను తీసుకున్నట్లు ఓ అధికారి పీటీఐకి తెలిపారు. ఘటన జరిగిన రోజు ఇంట్లోనే ఉన్నట్లు సల్మాన్ పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో తెలిపారు. రాత్రి పార్టీ కారణంగా ఆలస్యంగా పడుకున్నానని.. తెల్లవారుజామున బుల్లెట్ శబ్దాలతో నిద్రలేచినట్లు సల్మాన్ పోలీసులకు వెల్లడించారు.
నలుగురు సభ్యుల క్రైమ్ బ్రాంచ్ బృందం (Mumbai Crime Branch Team) జూన్ 4న సల్మాన్ నివాసం ఉండే బాంద్రాలోని గెలాక్సీ అపార్ట్‌మెంట్‌ను సందర్శించినట్లు అధికారి తెలిపారు. నటుడితోపాటు అతడి సోదరుడి స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్నట్లు చెప్పారు. సల్మాన్ వాంగ్మూలాన్ని దాదాపు నాలుగు గంటల పాటు నమోదు చేయగా.. అతని సోదరుడి స్టేట్మెంట్ను రెండు గంటలకుపైగా రికార్డ్ చేసినట్లు అధికారి తెలిపారు. ఈ సందర్భంగా క్రైమ్ బ్రాంచ్ అధికారులు వారిని దాదాపుగా 150 ప్రశ్నలు అడిగినట్లు సదరు అధికారి వెల్లడించారు.
ఏప్రిల్ 14న ముంబైలోని బాంద్రా ఏరియాలోని సల్మాన్ ఖాన్ నివాసం ఉండే గెలాక్సీ అపార్టుమెంట్ (Galaxy Apartments) దగ్గర కాల్పులు కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. బైక్‌పై వచ్చిన ఇద్దరు ఆగంతకులు మూడు రౌండ్ల కాల్పులు జరిపి పారిపోయారు. కేసు నమోదుచేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు అపార్ట్మెంట్స్ వద్ద సీసీటీవీ ఫుటేజీని పరిశీలించి ఆ దృశ్యాల ఆధారంగా.. నిందితుల్ని గుజరాత్లో అదుపులోకి తీసుకున్నారు. కాల్పులు జరిపిన నిందిలుల్ని విక్కీ గుప్తా, సాగర్ పాల్గా గుర్తించారు. అనంతరం వీరికి ఆయుధాలు సరఫరా చేశారన్న ఆరోపణలపై అనూజ్ తపన్, సోను సుభాశ్ చందర్‌ను అదుపులోకి తీసుకున్నారు. మొత్తంగా ఈ కేసులో ఆరుగురిని అరెస్ట్ చేశారు. వారిలో ఒకరైన అనుజ్ థాపన్ అనే నిందితుడు మే 1న పోలీసు లాకప్‌లో ఆత్మహత్య చేసుకున్నాడు.
Also Read..
No Admissions | సర్కారు బడిలో అడ్మిషన్స్ ఫుల్.. ప్రవేశాల కోసం ఎంట్రెన్స్ టెస్ట్
Chandrababu | ప్రజా పాలన ప్రారంభమైంది.. ప్రక్షాళన తిరుమల నుంచే : చంద్రబాబు
Pema Khandu | వరుసగా మూడోసారి.. అరుణాచల్ ముఖ్యమంత్రిగా పెమా ఖండూ ప్రమాణ స్వీకారం