Actor Ajith Kumar | ప్రముఖ సినీ నటుడు అజిత్ కుమార్ భావోద్వేగానికి గురయ్యారు. ఆయన తన తండ్రిని గుర్తు చేసుకుంటూ.. ఈ రోజు ఆయన ఉండి ఉంటే ఎంతో గర్వపడేవారంటూ ఎమోషనల్ అయ్యారు. రిపబ్లిక్ డే సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలను ప్రకటించిన విషయం విధితమే. వివిధ రంగాల్లో సేవలందించిన వారికి పద్మ అవార్డులకు ఎంపిక చేసింది. ఈ ఏడాది ఏడుగురికి పద్మవిభూషణ్, 19 మందికి పద్మభూషణ్, మరో 13 మందికి పద్మశ్రీని ప్రకటించింది.
తమిళ నటుడు ఎస్ అజిత్ కుమార్‌కు పద్మభూషణ్ అవార్డుకు ఎంపిక చేసింది. ఈ సందర్భంగా దేశంలోనే అత్యున్నత పౌర పురస్కారాల్లో ఒకటైన పద్మ భూషణ్ అవార్డుకు ఎంపికవడంపై అజిత్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా భావోద్వేగానికి గురైన తల.. సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టారు. ఇంతటి గౌరవం దక్కడం తనకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ సమయంలో తన తండ్రి ప్రాణాలతో ఉంటే బాగుండేదని అనిపిస్తోందన్నారు. ఈ సమయంలో తనను చూసి ఆయన ఎంతో గర్వపడే వారంటూ ఎమోషనల్ అయ్యారు.
భౌతికంగా ఆయన మన మధ్య లేకపోయినా.. ఆయన ఎప్పటికీ తనతోనే ఉంటారన్నారు. పద్మభూషణ్ పురస్కారరం ప్రకటించడం ఎంతో గౌరవంగా భావిస్తున్నానని అజిత్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలిపారు. ఈ గుర్తింపు వ్యక్తిగత ప్రశంస మాత్రమే కాదని.. ఎంతో మంది సమష్టి కృషి.. మద్దతుకు నిదర్శనంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇక తల్లితో పాటు భార్య షాలినికి కృతజ్ఞతలు తెలిపారు. గత 25 ఏళ్లుగా సుఖ సంతోషాల్లో షాలిని తోడుగా నిలిచిందని తెలిపాడు. తన పిల్లలు అనుష్క, అద్విక్లు తనకు గర్వకారణమని.. తన జీవితానికి వెలుగులు అంటూ అజిత్ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టారు.
అజిత్ కుమార్ ప్రముఖ తెలంగాణలోని సికింద్రాబాద్‌లో మే 1న, 1971లో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు సుబ్రహ్మణ్యం, మోహిని తల్లిదండ్రులు. తండ్రి తమిళనాడుకు చెందిన వ్యక్తి కాగా.. తల్లి కోల్‌కతాలోని సింధీ కుటుంబానికి చెందిన వారు. వీరు సికింద్రాబాద్‌లో ఉన్న సమయంలోనే అజిత్ పుట్టారు. అజిత్ పదో తరగతి వరకు మాత్రమే చదివారు. అనేక భాషల్లో అనర్గళంగా మాట్లాడగలరు. తెలుగు, తమిళం, కన్నడం, మళయాళంతో పాటు ఇంగ్లిష్‌లోనూ అనర్గళంగా మాట్లాడగలుగుతారు. అజిత్ కుమార్ 1990లో సినీ రంగంలోకి అడుగుపెట్టారు. తర్వాత రోజులకే హీరోగా పరిచయం అయ్యారు.
తన నట జీవితాన్ని తెలుగు చిత్రమైన ప్రేమ పుస్తకంతో కెరియర్ను ప్రారంభించారు. ఆ తర్వాత పలు తెలుగు, హిందీలోనూ పలు చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం విదాముయార్చి, గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రాల్లో నటిస్తున్నారు. 2000 ప్రముఖ హీరోయిన్ షాలిని పెళ్లి చేసుకున్నారు. అజిత్ మూడుసార్లు ఫిల్ం ఫేర్ బెస్ట్ యాక్టర్ అవార్డులు అందుకున్నారు. ఇక అజిత్‌కు ఫార్ములా రేస్ అంటే మక్కువ. ఈ ఏడాది దుబాయి వేదికగా జరిగిన ఇంటర్నేషనల్ కార్ రేస్‌లో అజిత్ కుమార్ జట్టు మూడో స్థానంలో నిలిచింది.