Superstar Rajinikanth | తమిళనాడు రాజకీయాల్లో నూతన ముఖ్యమంత్రిగా విజయ్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత చోటుచేసుకుంటున్న పరిణామాలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఈ నేపథ్యంలోనే మాజీ ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్‌ను సూపర్ స్టార్ రజనీకాంత్ పరామర్శించడంపై సోషల్ మీడియాలో రకరకాల పుకార్లు షికార్లు చేశాయి. విజయ్ సీఎం కాకుండా అడ్డుకునేందుకే రజనీకాంత్ ఈ భేటీ అయ్యారంటూ జరుగుతున్న ప్రచారాలపై తాజాగా సూపర్ స్టార్ తనదైన శైలిలో స్పందిస్తూ, వాటన్నింటికీ గట్టి కౌంటర్ ఇచ్చారు.
తమ మధ్య ఉన్న స్నేహాన్ని గుర్తుచేస్తూ రజనీకాంత్ ఈ వివాదానికి తెరదించారు. “నాకు, స్టాలిన్‌కు మధ్య దాదాపు 35 ఏళ్ల సుదీర్ఘ స్నేహం ఉంది. కొలత్తూరు నియోజకవర్గంలో ఆయన ఓడిపోవడం నాకు ఎంతో బాధ కలిగించింది. ఆ స్నేహంతోనే నేను ఆయనను పరామర్శించడానికి వెళ్లాను. అంతే తప్ప, విజయ్ సీఎం కాకూడదని నేను అన్నట్లు, రెండు పార్టీలను విలీనం చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు. అంత దిగజారుడు తనం ఉన్న వ్యక్తిని నేను కాను” అని రజనీకాంత్ ఎంతో పరిణతితో కూడిన స్పష్టతనిచ్చారు.
ఇదే సమయంలో నూతన సీఎం విజయ్ విజయాన్ని ఆయన మనస్ఫూర్తిగా అభినందించారు. విజయ్‌కు తనకు మధ్య ఉన్న వయసు వ్యత్యాసాన్ని ప్రస్తావిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “విజయ్‌కు నాకు మధ్య 20 నుంచి 25 సంవత్సరాల జనరేషన్ గ్యాప్ ఉంది. నేనిప్పుడు అసలు రాజకీయాల్లోనే లేను, అలాంటప్పుడు ఆయనపై నాకెందుకు అసూయ ఉంటుంది? ఒకవేళ నా సమకాలీనుడైన కమల్ హాసన్ గనుక సీఎం అయి ఉంటే నేను ఈర్ష్య పడేవాడినేమో! కానీ విజయ్‌తో నేను పోటీ పడటం మా ఇద్దరికీ మంచిది కాదు” అని రజనీకాంత్ పేర్కొన్నారు.
కేంద్రంలోని బీజేపీతో పాటు తమిళనాడులోని రెండు ప్రధాన ద్రావిడ పార్టీలను ఒంటరిగా ఎదుర్కొని, కేవలం 52 ఏళ్ల వయసులోనే విజయ్ సాధించిన ఈ అఖండ విజయం సామాన్యమైనది కాదని రజనీకాంత్ కొనియాడారు. గతంలో దిగ్గజాలు ఎంజీఆర్, ఎన్టీఆర్ సాధించిన విజయాల కంటే ఇది చాలా పెద్దదని, సినీ రంగానికి చెందిన ఒక వ్యక్తి ఈ స్థాయికి చేరడం తనకు ఎంతో గర్వకారణంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు. గతంలో 1996లో కరుణానిధి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు కూడా తాను వెళ్లలేదని గుర్తు చేస్తూ.. రాజకీయాలు, సిద్ధాంతాలు ఏవైనా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన విజయ్‌కు తన పూర్తి మద్దతు, శుభాకాంక్షలు ఉంటాయని సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రకటించారు.