అనుపమ పరమేశ్వరన్, సురేష్ గోపీ ప్రధాన పాత్రల్లో నటించిన కోర్ట్‌రూమ్ డ్రామా ‘జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ’ సినిమా టైటిల్‌పై తలెత్తిన వివాదం మరింత తీవ్రమవుతున్నది. ఈ సినిమా టైటిల్లోని ‘జానకి’ అనే పేరుపై కేంద్ర సెన్సార్ బోర్డ్ అభ్యంతరం తెలియజేస్తూ.. చిత్ర విడుదలకు అనుమతిని నిరాకరించిన విషయం తెలిసిందే. హిందూ దేవతామూర్తి అయిన సీతాదేవికి మరోపేరైన జానకి పేరును లైంగిక వేధింపులు ఎదుర్కొన్న మహిళ పాత్రకు పెట్టడం మతపరమైన మనోభావాలను కించపరచడమేనని సెన్సార్ బోర్డ్ అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో సినిమా విడుదలకు అనుమతిని కోరుతూ చిత్ర బృందం కేరళ హైకోర్టును ఆశ్రయించింది.
ఈ కేసు విచారణను చేపట్టిన హైకోర్ట్… సెన్సార్ బోర్డ్ వైఖరిని తప్పుబట్టింది. ‘రేపిస్టు పాత్రలకు రామా, కృష్ణ, జానకి లాంటి పేర్లు పెడితే అభ్యంతరం చెప్పడంలో అర్థం ఉంది. కానీ ఈ సినిమాలో ఓ మహిళ న్యాయం కోసం పోరాటం చేస్తున్నది. ఆమె పాత్ర పేరుకు అభ్యంతరం ఎందుకు? అసలు జానకి అనే పేరు పెట్టడంలో తప్పేముంది? అని హైకోర్టు ప్రశ్నించింది. సెన్సార్ బోర్డ్ వైఖరి చూస్తుంటే దర్శకులు ఎలాంటి కథల్ని ఎంచుకోవాలో, ఎలాంటి టైటిల్స్ పెట్టాలో వారే నిర్ణయించేలా ఉన్నారని హైకోర్ట్ ఆగ్రహం వ్యక్తం చేసింది. పాత్రలకు తగిన పేర్లు పెట్టుకునే స్వేచ్ఛ, అధికారం దర్శకులకు ఉంటుందని, ఆ విషయంలో సెన్సార్ బోర్డ్ జోక్యం తగదని, ఇది ప్రాథమిక హక్కులకు భంగం కలిగించడమేనని హైకోర్టు పేర్కొంది. సెన్సార్ బోర్డ్ వివాదం నేపథ్యంలో గత నెల 27న విడుదల కావాల్సిన ‘జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ’ సినిమా విడుదల వాయిదా పడింది.