S.Janaki | భారత సినీ సంగీత ప్రపంచాన్ని తన మధుర గానంతో దశాబ్దాల పాటు అలరించిన ప్రముఖ గాయని ఎస్. జానకి మరణం దేశవ్యాప్తంగా విషాదాన్ని నింపింది. సుమారు ఆరు దశాబ్దాల పాటు వేలాది పాటలతో కోట్లాది మంది సంగీతాభిమానుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన జానకి, వయోభారంతో పాటు అనారోగ్య సమస్యల కారణంగా చికిత్స పొందుతూ 88 ఏళ్ల వయసులో తుదిశ్వాస విడిచారు. జానకి మరణవార్త తెలిసిన వెంటనే సినీ, రాజకీయ, సాహిత్య రంగాలకు చెందిన ప్రముఖులు, అభిమానులు ఆమెకు నివాళులు అర్పిస్తూ ఆమె పాడిన చిరస్మరణీయ గీతాలను గుర్తు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆమె జీవితానికి సంబంధించిన ఎన్నో విశేషాలు మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అందులో ముఖ్యంగా 2013లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మభూషణ్ పురస్కారాన్ని ఆమె తిరస్కరించిన ఘటన మరోసారి చర్చనీయాంశంగా మారింది. 2013లో కేంద్ర ప్రభుత్వం దేశ అత్యున్నత పౌర పురస్కారాల్లో ఒకటైన పద్మభూషణ్ అవార్డుకు ఎస్. జానకిని ఎంపిక చేసింది. అయితే అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తూ ఆమె ఆ పురస్కారాన్ని గౌరవపూర్వకంగా తిరస్కరించారు.ఆ సమయంలో కేరళలో ఓ వివాహ కార్యక్రమానికి హాజరైన జానకి మీడియాతో మాట్లాడుతూ, తాను ఈ అవార్డును స్వీకరించబోనని ప్రకటించారు. గత 55 ఏళ్లుగా పలు భారతీయ భాషల్లో పాటలు పాడానని, అన్ని ప్రాంతాల ప్రజలు తనను ప్రేమించి ఆదరించారని, అభిమానుల అభిమానం కంటే గొప్ప పురస్కారం మరొకటి లేదని ఆమె తెలిపారు.
అలాగే ప్రభుత్వం పట్ల తనకు ఎలాంటి అసంతృప్తి లేదని, ప్రభుత్వం తప్పు చేసిందని తాను భావించడం లేదని కూడా స్పష్టం చేశారు. తన పాటలను అభిమానులు హృదయపూర్వకంగా ఆదరించడమే తనకు అత్యున్నత గౌరవమని చెప్పారు. తర్వాత ఇచ్చిన మరో ఇంటర్వ్యూలో జానకి మరింత స్పష్టంగా స్పందించారు. దక్షిణ భారత కళాకారులకు సరైన సమయంలో గుర్తింపు లభించడం లేదనే అభిప్రాయాన్ని ఆమె వ్యక్తం చేశారు. తాను సంగీత రంగానికి ఎన్నో దశాబ్దాలుగా సేవలందించినప్పటికీ ఈ గౌరవం చాలా ఆలస్యంగా వచ్చిందని పేర్కొన్నారు. అందుకే పద్మభూషణ్‌ను స్వీకరించకూడదని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. ఆ సమయంలో జానకి భారతరత్నకు అర్హురాలని ఆమె వ్యాఖ్యానించినట్లు కూడా పలు కథనాలు వెలువడ్డాయి. అయితే ఆ వ్యాఖ్యలపై అధికారికంగా ఎప్పుడు స్పందించలేదు.
జానకి కుమారుడు మురళీకృష్ణ కూడా అప్పట్లో మీడియాతో మాట్లాడుతూ, ఈ అవార్డు తమ తల్లికి చాలా ముందే రావాల్సిందని అన్నారు. ఆమెను పురస్కారానికి ఎంపిక చేసిన విషయాన్ని ముందుగా కుటుంబానికి తెలియజేయలేదని, ప్రకటన వచ్చిన తర్వాతే తమకు సమాచారం తెలిసిందని చెప్పారు. చాలా ఆలస్యంగా వచ్చిన గుర్తింపును గౌరవపూర్వకంగా తిరస్కరించాలని ఆమె నిర్ణయించుకున్నారని వెల్లడించారు.