‘ఇద్దరు వ్యక్తులు ఒకే తప్పు చేస్తే అందులో ఓ వ్యక్తికి 24గంటల్లో బెయిల్ వస్తుంది. మరొకరికి రెండేళ్లయినా రాదు. వ్యవస్థలోని ఇలాంటి తప్పుల్ని ఎత్తిచూపుతూ చిలకలూరిపేట బస్సు దహనం, చుండూరు ఘటన, జూబ్లీహిల్స్ బాంబ్బ్లాస్ట్స్ నేపథ్యంలో ఈ సినిమా తీశా’ అన్నారు దర్శకుడు రాజ్ ఆర్. ‘మల్లేశం’ ‘8ఏమ్ మెట్రో’ చిత్రాలతో టాలెంటెడ్ డైరెక్టర్‌గా గుర్తింపు పొందిన ఆయన రూపొందించిన తాజా చిత్రం ‘23’ ఈనెల 16న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా బుధవారం రాజ్ ఆర్ పాత్రికేయులతో ముచ్చటించారు. తాను ఈ సినిమాలో చాలా సెన్సిటివ్ అంశాలను చర్చించానని, మన న్యాయవ్యవస్థలోని లోపాల్ని ఎత్తిచూపానని అన్నారు.
‘ఓ జర్నలిస్ట్ మిత్రున్ని కలిసినప్పుడు చిలకలూరిపేట బస్సు దహనం గురించి చెప్పాడు. యాదృచ్చికంగా అదే రాత్రి మరో మిత్రుడు చుండూరు ఘటన గురించి మాట్లాడారు. వాస్తవానికి ఈ రెండు ఘటనల్లో సినిమాకు అవసరమయ్యే కథ లేదు. కానీ ఆ రెండింటిని భిన్నకోణాల్లోంచి చూస్తే ఓ కథగా సిద్ధం చేయొచ్చు అనిపించింది. అలా ఈ సబ్జెక్ట్‌కు అంకురార్పణ జరిగింది’ అన్నారు. తాను తీసే ప్రతీ కథకు ఓ పర్పస్ ఉంటుందని, తన సినిమా టార్గెట్ ఆడియెన్స్‌కు చేరువైతే దర్శకుడిగా లక్ష్యం నెరవేరినట్లేనని రాజ్ ఆర్ అన్నారు. ‘ఈ కథలో మల్టీపుల్ థీమ్స్‌తో పాటు ఓ లవ్‌స్టోరీ ఉంటుంది.
నటీనటులు అద్భుతమైన పర్ఫార్మెన్స్ కనబరిచారు. ఈ సినిమా విషయంలో సెన్సార్ నుంచి ఇబ్బందులు ఎదుర్కొన్నా. చాలా సీన్స్, మాటలను తీసేయమని చెప్పారు. గతంలో అనేక చిత్రాల్లో అవే సన్నివేశాలకు ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు. చట్టం అందరికి సమానంగా వర్తించాలి. కానీ అలా జరగడం లేదు. దీనిని ఎవరో ఒకరు ప్రశ్నించాలి. అలాంటి ప్రశ్నల్ని రేకెత్తించే సినిమా ఇది’ అని రాజ్ ఆర్ పేర్కొన్నారు.