Dhanush | కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ పేరు ఇటీవల సోషల్ మీడియాలో గాసిప్‌లకు కేంద్రబిందువుగా మారింది. అందాల నటి మృణాల్ ఠాకూర్‌తో ఆయన పెళ్లి చేసుకోబోతున్నారంటూ కొన్ని రోజులుగా రూమర్లు హల్చల్ చేస్తున్నాయి. ఇద్దరూ ఎక్కడ కనిపించినా, ఏం చేసినా వాటిని పెళ్లి వార్తలతో లింక్ చేయడం నెటిజన్లకు అలవాటైపోయింది. అయితే ఈ ప్రచారానికి బలం చేకూర్చినట్టుగా వచ్చిన ఓ వీడియో అసలు విషయం బయటపడగానే పూర్తిగా ఫేక్ అని తేలింది.ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయిన ఒక వీడియోలో ధనుష్–మృణాల్ సంప్రదాయ పద్ధతిలో పెళ్లి చేసుకున్నట్లు, ప్రముఖ స్టార్లు అతిథులుగా హాజరైనట్లు చూపించారు.
కానీ అది AI టెక్నాలజీతో సృష్టించిన నకిలీ వీడియో అని స్పష్టమైంది. ఫిబ్రవరి 14న వీరిద్దరి పెళ్లి జరుగుతుందనే ప్రచారం నడుస్తున్న సమయంలోనే ఈ వీడియో రావడం చర్చకు దారి తీసింది. దీనిపై మృణాల్ సన్నిహిత వర్గాలు స్పందిస్తూ, ఇలాంటి గాసిప్‌లకు ఎలాంటి ఆధారాలు లేవని, ఆమె పూర్తిగా సినిమాలపైనే దృష్టి పెట్టిందని స్పష్టం చేశాయి. మృణాల్ కూడా ఓ క్రిప్టిక్ పోస్ట్ ద్వారా ఈ పుకార్లకు పరోక్షంగా బ్రేక్ వేసినట్టైంది. ఈ నేపధ్యంలో జనవరి 28న ధనుష్ తన ఇద్దరు కుమారులు యాత్ర, లింగలతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం మరోసారి వార్తల్లో నిలిచింది. దర్శనం అనంతరం బయటకు వస్తున్న సమయంలో అభిమానులు భారీగా చేరుకోవడంతో, పిల్లలు తమ తండ్రిని కాపాడుకుంటూ ముందుకు నడిచిన వీడియోలు సోషల్ మీడియాలో హృదయాలను గెలుచుకున్నాయి. తండ్రి–కొడుకులు పట్టు వస్త్రాల్లో చాలా నిరాడంబరంగా కనిపించడం అభిమానులను ఆకట్టుకుంది.
ధనుష్ ఆధ్యాత్మికతకు ప్రాధాన్యం ఇవ్వడం కొత్త కాదు. కుటుంబంలో శుభకార్యాలు జరిగినప్పుడు, లేదా కొత్త ప్రాజెక్ట్ ప్రారంభానికి ముందు స్వామివారిని దర్శించుకోవడం ఆయనకు అలవాటు. ఈసారి కూడా పెద్ద కుమారుడు యాత్ర చదువులో మంచి ఫలితాలు సాధించిన సందర్భంలో కృతజ్ఞతగా తిరుమల వచ్చినట్టు సమాచారం. అయితే దీనిని పెళ్లి పుకార్లకు సమాధానంగా భావించాల్సిన అవసరం లేదని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.ఇక కెరీర్ పరంగా చూస్తే, ధనుష్ ప్రస్తుతం చాలా కీలక దశలో ఉన్నారు. నటుడిగానే కాకుండా దర్శకుడిగా కూడా వరుసగా ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌లను లైనప్ చేస్తున్నారు. ఇటీవల సంక్రాంతి సందర్భంగా ‘కర’ అనే రా అండ్ గ్రిట్టీ సస్పెన్స్ థ్రిల్లర్‌ను అధికారికంగా ప్రకటించారు. విఘ్నేష్ రాజా దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో ‘కరస్వామి’ అనే పవర్ఫుల్ పాత్రలో ధనుష్ కనిపించనున్నారు.