Janhvi Kapoor | మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, దర్శకుడు బుచ్చిబాబు సన తెరకెక్కించిన భారీ పాన్ ఇండియా చిత్రం ‘పెద్ది’ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా దూసుకుపోతోంది. విడుదలైన తొలి రోజు నుంచే పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లను రాబడుతూ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా రామ్ చరణ్ నటన, ఆయన మేకోవర్, భావోద్వేగభరితమైన సన్నివేశాల్లో చూపించిన పెర్ఫార్మెన్స్కు సినీ అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రంలో కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, సీనియర్ నటుడు జగపతిబాబు కీలక పాత్రలు పోషించగా, బాలీవుడ్ అందాల భామ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించింది. ‘దేవర’ తర్వాత జాన్వీ నటించిన రెండో తెలుగు సినిమా కావడంతో ఆమె పాత్రపై మొదటి నుంచే ఆసక్తి నెలకొంది.
‘పెద్ది’లో జాన్వీ కపూర్ ‘అచ్చియమ్మ’ అనే గ్రామీణ యువతి పాత్రలో కనిపించింది. పల్లెటూరి అమ్మాయి అమాయకత్వం, ప్రేమ, భావోద్వేగాలను ప్రతిబింబించే ఈ పాత్రలో ఆమె నటనకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ముఖ్యంగా గ్రామీణ నేపథ్యంలో కనిపించిన ఆమె లుక్, బాడీ లాంగ్వేజ్, భావ వ్యక్తీకరణలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అయితే సినిమా చూసిన తర్వాత చాలా మంది ప్రేక్షకుల్లో ఒక సందేహం మొదలైంది. తెరపై జాన్వీ పాత్రకు అంత సహజమైన తెలుగు పలికిన డబ్బింగ్ ఎవరు చెప్పారనే చర్చ సోషల్ మీడియాలో మొదలైంది. తాజాగా ఈ విషయంపై స్పష్టత వచ్చింది. ‘పెద్ది’ సినిమాలో జాన్వీ కపూర్ పాత్రకు ప్రముఖ గాయని, యాంకర్ సమీరా భరద్వాజ్ డబ్బింగ్ చెప్పినట్లు వెల్లడైంది. ఈ విషయాన్ని స్వయంగా సమీరా తన సోషల్ మీడియా ఖాతా ద్వారా అభిమానులతో పంచుకుంది.
డబ్బింగ్ స్టూడియోలో తీసుకున్న ఫొటోలను షేర్ చేసిన ఆమె, “జాన్వీ కపూర్ పాత్రకు డబ్బింగ్ చెప్పడం చాలా ఆనందంగా ఉంది. ‘పెద్ది’ వంటి అద్భుతమైన సినిమాలో భాగం కావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన చిత్రబృందానికి ధన్యవాదాలు” అంటూ తన సంతోషాన్ని వ్యక్తం చేసింది. గతంలో జాన్వీ కపూర్ నటించిన ‘దేవర’ చిత్రంలో ఆమె పాత్రకు ఆర్జే శ్వేత డబ్బింగ్ చెప్పిన విషయం తెలిసిందే. అయితే ‘పెద్ది’లో మాత్రం జాన్వీ పాత్రకు విజయనగరం యాసతో కూడిన ప్రత్యేకమైన డబ్బింగ్ అవసరం కావడంతో సమీరా భరద్వాజ్‌ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. సమీరా చెప్పిన డబ్బింగ్ కారణంగా అచ్చియమ్మ పాత్రకు మరింత సహజత్వం వచ్చిందని, గ్రామీణ నేపథ్యంలో ఆ పాత్ర ప్రేక్షకులకు దగ్గర కావడంలో ఆమె వాయిస్ కీలక పాత్ర పోషించిందని సినీ అభిమానులు అభిప్రాయపడుతున్నారు. కాగా, సమీరా భరద్వాజ్ గాయనిగా, యాంకర్‌గా, టెలివిజన్ హోస్ట్‌గా ఆమె తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు.