Vijay Devarakonda | గత పదేండ్లలో తెలుగు ఇండస్ట్రీలోకి దూసుకొచ్చిన బాణం విజయ్ దేవరకొండ. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా వచ్చి స్టార్ హీరో అయిపోయాడు రౌడీ బాయ్. హిట్టు ఫ్లాపులతో పనిలేని ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. చాలా మంది హీరోలు కలలు కనే మార్కెట్ సొంతం చేసుకున్నాడు. అయితే ఉన్నట్టుండి తనపై కుట్ర జరుగుతుందని.. తన సినిమాలను తొక్కేయాలని చూస్తున్నారు అంటూ ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ అవుతున్నాయి. అసలు విజయ్ను తొక్కాలని ఎవరు చూస్తారు.. అంత అవసరం ఎవరికి వచ్చిందబ్బా అంటూ ఆరాలు తీస్తున్నారు నెటిజన్స్. మరి నిజంగానే విజయ్ దేవరకొండ ఎదుగుతున్న విధానాన్ని జీర్ణించుకోలేకపోతున్నారా..? కావాలనే అతడి సినిమాలపై నెగిటివ్ ప్రచారం చేస్తున్నారా..? అసలు సోషల్ మీడియా సినిమాను చంపేస్తుందా? బతికిస్తుందా..? అనే విషయంపై ఇప్పుడు చాలా డిబేట్ నడుస్తుంది.
ఒక్క విజయ్ దేవరకొండ సినిమాలకు మాత్రమే కాదు.. తలా తోక లేని వాళ్లు చెప్పే సోషల్ మీడియా రివ్యూస్ చాలా సినిమాలకు శాపంగా మారుతున్నాయనే ప్రచారం కూడా ఎక్కువగానే జరుగుతుంది. ఐమాక్స్‌లో పొద్దున్న 8 గంటలకు షో పడితే చాలు.. కొందరు అదేదో పని ఉన్నట్లు ముందుగానే వచ్చేసి ఫేక్ రివ్యూలు బాగానే ఇస్తున్నారు. అది కేవలం విజయ్ దేవరకొండ సినిమాలకు మాత్రమే కాదు.. ఈ మధ్య ప్రతి సినిమాకు ఇదే జరుగుతుంది. అందులో విషయం ఉన్న సినిమాలు బతికిపోతున్నాయి.. మ్యాటర్ లేని సినిమాలకు ఆ రివ్యూస్ ఎఫెక్ట్ బాగానే పడుతుంది. ఇప్పుడు విజయ్ అడ్రస్ చేసిన విషయం కూడా ఇదే. అసలెవరు వీళ్లంతా.. ఎందుకు సినిమాలను టార్గెట్ చేస్తున్నారు.. అలా చేస్తున్న వాళ్లపై ఇండస్ట్రీలో ఉన్న వాళ్లు ఎలాంటి యాక్షన్ ఎందుకు తీసుకోవడం లేదనే క్వశ్చన్స్ రైజ్ చేస్తున్నాడు. ఈ మధ్య రిలీజయ్యే ప్రతీ సినిమాను టార్గెట్ చేస్తుందీ బ్యాచ్.
సోషల్ మీడియా ఈ రోజుల్లో చాలా పవర్ ఫుల్. సినిమా ఫేట్ డిసైడ్ చేసే స్థాయికి ఇది ఎదిగింది. అలాంటప్పుడు ఎలాంటి క్రెడిబిలిటీ లేని కొందరు చెప్పే రివ్యూస్‌తో సినిమాలు నాశనం అవుతున్నాయనే చర్చ మొదలైందిప్పుడు ఇండస్ట్రీలో. కొత్త సినిమా ఏది విడుదలైనా.. ముందు నెగిటివ్ రివ్యూస్ వచ్చాకే రియల్ రివ్యూస్ వినిపిస్తున్నాయి. ఆ లోపు జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. కథలో దమ్ముంటే మాత్రం.. నెగిటివ్ రివ్యూస్ ఆపలేవని ఖుషీతో పాటు జైలర్, బేబీ, విరూపాక్ష, దసరా లాంటి చాలా సినిమాలు నిరూపించాయి. ఒక్కటి మాత్రం నిజం.. సోషల్ మీడియా సినిమాలకు ఎంత ప్లస్ అవుతుందో.. అంతే మైనస్ కూడా అవుతుంది.