Anushka Shetty | దక్షిణాదిలో కొన్నేండ్ల పాటు స్టార్ హీరోయిన్గా వెలిగింది అనుష్క శెట్టి. తెలుగు, తమిళంలో దాదాపు పేరున్న అందరు హీరోలతో ఆమె కలిసి నటించింది. ‘బాహుబలి’తో జాతీయ స్థాయి గుర్తింపు పొందింది. తన సుదీర్ఘ ప్రస్థానంలో ప్రాంతీయ చిత్రాల్లో ఎంతో ఖ్యాతి పొందినా బాలీవుడ్లో సినిమా చేయలేదు. హిందీ చిత్రాల్లో నటించకపోవడంపై ఇటీవల ఓ ఇంటర్వ్యూలో అనుష్క మాట్లాడింది.
హిందీలో ఆశించిన స్థాయి అవకాశాలు రాలేదని, వచ్చిన ఆఫర్స్ తనకు నచ్చలేదని ఆమె తెలిపింది. అనుష్క మాట్లాడుతూ…‘సూర్య, నేను కలిసి తమిళంలో నటించిన ‘సింగం’ సినిమాను అదే పేరుతో హిందీలో రీమేక్ చేశారు. అజయ్ దేవగణ్ హీరోగా నటించారు. ఆ సినిమాలో కాజల్ కంటే ముందు నన్నే నాయిక కోసం సంప్రదించారు. పారితోషికం విషయంలో మిస్‌కమ్యునికేషన్ జరిగింది. అలా ఆ ప్రాజెక్ట్‌లో నటించలేకపోయాను. ఆ తర్వాత వచ్చిన అవకాశాలు నా ఇమేజ్ స్థాయికి తగినవి కాకపోవడంతో వదిలేశాను. బాలీవుడ్ నుంచి మంచి అవకాశాలు వస్తాయనే నమ్మకం ఇప్పటికీ ఉంది’ అని చెప్పింది. ప్రస్తుతం అనుష్క నవీన్ పోలిశెట్టితో కలిసి ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ చిత్రంలో నటిస్తున్నది.