టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డేకు కోపం వచ్చింది. ప్రస్తుతం బాలీవుడ్‌పై దృష్టి సారించిన ఈ అందాల భామ.. షాహిద్ కపూర్‌తో ‘దేవా’ అనే సినిమాలో నటించింది. ఇటీవలే ఆ సినిమా విడుదలైంది. ఈ సినిమా ప్రమోషన్లో విలేకరుల అడిగిన ప్రశ్నలు పూజాను అసహనానికి గురిచేశాయి. ‘సల్మాన్, హృతిక్, రణ్వీర్, షాహిద్ వంటి స్టార్ హీరోల చిత్రాల్లో నటించడాన్ని మీరు అదృష్టంగా భావిస్తారా? అసలు అందుకు మీరు అర్హులేనా? అని విలేకరులు పూజాను ప్రశ్నించగా.. ‘ఎస్.. అర్హురాలినే. ఒకవేళ అదృష్టం వల్లే నాకు అవకాశాలు వచ్చాయని మీరు అనుకుంటే.. నేను ఏమాత్రం బాధ పడను.
ఏదైనా అవకాశం వచ్చినప్పుడు దానికి అనుగుణంగా సన్నద్ధమై పూర్తి స్థాయిలో ఆ పాత్రకు న్యాయం చేయాలి. అదే అదృష్టంగా భావిస్తా.’ అని సమాధానమిచ్చింది పూజా. మీరు సినిమాలు ఎలా ఎంచుకుంటారు? స్టార్ హీరోల సినిమాలైతేనే చేస్తారా? అని మరో విలేకరి ప్రశ్నించగానే.. పూజా ఆగ్రహానికి గురైంది. ‘అసలు మీ సమస్య ఏంటి?’ అని ఎదురు ప్రశ్నించింది. వెంటనే పక్కనే ఉన్న షాహిద్ కపూర్ వాతావరణం వేడెక్కడాన్ని గమనించి తన జోకులతో చల్లపరిచే ప్రయత్నం చేశారు. ఏదేమైనా ఓ కథానాయికను అలాంటి ప్రశ్నలతో ఇబ్బంది పెట్టడం సబబు కాదని పలువురు అభిప్రాయపడుతున్నారు.