NTR | తమ అభిమాన హీరోను ఒక్కసారైన నేరుగా చూడాలన్న తపన అభిమానులలో ఎంతగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకరైన జూనియర్ ఎన్టీఆర్ అంటే అభిమానులకు ప్రత్యేకమైన అభిమానం. అవకాశమొస్తే ఎప్పుడూ వారిని కలవాలని, వాళ్ల కళ్లలో ఆనందం చూడాలని ప్రయత్నించే తారక్… గత కొన్ని సంవత్సరాల్లో తక్కువ సినిమాల కారణంగా అభిమానులను ఎక్కువగా కలిసే అవకాశం పొందలేదు. ఇక ‘దేవర’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ కూడా జరగకపోవడంతో ఫ్యాన్స్ కొంతవరకు నిరాశ చెందారు.
అయితే తారక్ ‘వార్-2’చిత్రంతో బాలీవుడ్లో అడుగుపెడుతున్న విషయం తెలిసిందే. ఆగస్ట్ 14న ఈ చిత్రం విడుదల కానుండగా, మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్ ఆదివారం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి వేలాది మంది అభిమానులు హాజరయ్యారు. కానీ పాసులు పరిమితంగా ఇవ్వడంతో పలువురు బయటే ఉండిపోయారు. అందులో పుట్టు మూగవాడు, చెవిటి వాడైన వ్యక్తి కూడా ఉన్నారు. ఎన్టీఆర్‌ని చూడాలని గుంటూరు జిల్లా మాచర్ల నుంచి రాగా, ఆ అభిమానికి ‘వార్-2’ ఈవెంట్ పాస్ దక్కలేదు.
అయితే ఈవెంట్ పాస్ దక్కకపోవడంతో ఒక టీవీ చానెల్లో తన ఆవేదనను సైగల ద్వారా వెల్లడించాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీన్ని చూసిన ఎన్టీఆర్ పీఆర్ టీమ్ వెంటనే స్పందించింది. ఈ అభిమానికి కేవలం పాస్ మాత్రమే కాదు, తారక్‌ను వ్యక్తిగతంగా కలుసుకునే అవకాశం కూడా కల్పించారు. ఎన్టీఆర్‌ను ప్రత్యక్షంగా చూసి, అతనితో కలిసి ఫొటోలు దిగిన ఈ అభిమాని ముఖంలో ఆనందం మరచిపోలేనిది. ఈ మధుర క్షణాలను చూసిన ఎన్టీఆర్ అభిమానులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. నిజమైన స్టార్ అంటే అభిమానుల మనసు గెలవగలిగిన వారే అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇక ఇదే ఈవెంట్లో ఎన్టీఆర్ చాలా ఎమోషనల్‌గా మాట్లాడుతూ తన తొలి అభిమానిని కూడా పరిచయం చేశాడు.