e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, June 20, 2021
Home సినిమా వ్యాక్సినేషన్‌ తర్వాతే షూటింగ్‌ షురూ?

వ్యాక్సినేషన్‌ తర్వాతే షూటింగ్‌ షురూ?

వ్యాక్సినేషన్‌ తర్వాతే షూటింగ్‌ షురూ?

కరోనా మహమ్మారికి చరమగీతం పాడాలంటే వ్యాక్సిన్‌ను మించిన వజ్రాయుధం లేదని నిపుణులు చెబుతున్నారు. కరోనా ప్రభావంతో అనేక రంగాల కార్యకలాపాలు స్తంభించిపోయాయి. లక్షలాది మంది ఉపాధి ప్రశ్నార్థకమైంది. తిరిగి తమ జీవనోపాధిని పునరుద్దరించుకోవడానికి వ్యాక్సిన్‌ మాత్రమే ఆశాజనకంగా కనిపిస్తోంది. కరోనా ధాటికి సినీ రంగం తీవ్రమైన ఒడిదుడుకులకు గురైంది. సినీ పరిశ్రమ పూర్తిస్థాయిలో పనిచేయాలంటే వ్యాక్సినేషన్‌ ఒక్కటే మార్గమని భావిస్తున్నారు. ఇప్పటికే అగ్రనాయకానాయికలు వ్యాక్సిన్‌ వేసుకున్నారు. ఇతర సాంకేతిక నిపుణులు, కార్మికులకు వ్యాక్సినేషన్‌ను అందించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

వ్యాక్సినేషన్‌ తర్వాతే షూటింగ్‌ షురూ?


కరోనా మొదటిదశ తగ్గుముఖం పట్టడంతో డిసెంబర్‌లో సినిమా చిత్రీకరణలు మొదలయ్యాయి. సంక్రాంతి సమయంలో విడుదలైన సినిమాలు పెద్ద విజయాల్ని సాధించడంలో సినీ పరిశ్రమలో నూతనోత్సాహం వెల్లివిరిసింది. అగ్ర హీరోలంతా ఉత్సాహంగా షూటింగ్‌లనుమొదలుపెట్టారు. ప్రతివారం నాలుగైదు కొత్త సినిమాల విడుదలలతో బాక్సాఫీస్‌ కొత్త శోభను సంతరించుకుంది. అయితే ఆ ఆనందం మూడు నెలల ముచ్చటగానే మిగిలిపోయింది. సెకండ్‌ వేవ్‌ ఉధృతి కారణంగా తిరిగి సినీ పరిశ్రమ పూర్తిగా స్తంభించిపోయింది. కరోనా భయంతో సెట్స్‌లో అడుగుపెట్టడానికి హీరోహీరోయిన్లతో పాటు యూనిట్‌ సభ్యులు భయపడుతున్నారు. రెండు, మూడు నెలలు ఎదురుచూసైనా సరే వ్యాక్సినేషన్‌ పూర్తయిన తర్వాతే చిత్రీకరణలు మొదలుపెట్టాలనే యోచనలో ఉన్నట్లు తెలిసింది. చిరంజీవి ‘ఆచార్య’, వెంకటేష్‌ ‘ఎఫ్‌-3’, ‘దృశ్యం-2’, బాలకృష్ణ ‘అఖండ’ సినిమాల చిత్రీకరణలు దాదాపు పూర్తయ్యాయి.

మే నెలలో తమ సినిమాలతో ప్రేక్షకుల్ని అలరించాలని కలలుకన్న ఆయా చిత్రబృందాలకు సెకండ్‌ వేవ్‌ నిరాశను మిగిల్చింది. మరోవైపు పలువురు అగ్ర హీరోలు కొవిడ్‌ బారిన పడటం చిత్రసీమలో ఆందోళనను కలిగిస్తోంది. అల్లు అర్జున్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో ‘పుష్ప’ షూటింగ్‌ను అర్ధాంతరంగా నిలిపివేశారు. ఎన్టీఆర్‌ కరోనా బారిన పడటంతో ముందుజాగ్రత్తగా ‘ఆర్‌ఆర్‌ఆర్‌ ’షూటింగ్‌ను వాయిదావేశారు. అలాగే మహేష్‌బాబు ‘సర్కారువారి పాట’ షూటింగ్‌కు కరోనా కారణంగానే బ్రేకులు పడ్డాయి.

హీరో క్యాస్టూమర్‌కు కరోనా రావడం, సినిమా అసిస్టెంట్‌ డైరెక్టర్‌ వైరస్‌తో కన్నుమూయడంతో చిత్రీకరణ ఆగిపోయింది. కొవిడ్‌ ప్రభావంతోనే ప్రభాస్‌ రాధేశ్యామ్‌, సలార్‌, ఆదిపురుష్‌ సినిమాల షూటింగ్‌లకు ప్యాకప్‌ చెప్పాల్సివచ్చింది. రవితేజ, నాగార్జున, నాగచైతన్యతో పాటు చాలా మంది అగ్ర హీరోల సినిమాషూటింగ్‌లకు కరోనా దెబ్బ పడింది. ఈ సినిమాల షూటింగ్‌లు తిరిగి ఎప్పుడు మొదలవుతాయనేది ఎవరూ చెప్పలేకపోతున్నారు. వ్యాక్సినేషన్‌ ప్రక్రియ చేపట్టడమే ఈ సమస్యకు పరిష్కార మార్గంగా సినీ వర్గాలు భావిస్తున్నట్లు తెలిసింది. నాయకనాయికల నుంచి లైట్‌బాయ్‌ వరకు అందరికి వ్యాక్సినేషన్‌ జరిగితేనే ఎలాంటి భయాలు లేకుండా షూటింగ్‌లు చేసుకోవచ్చనే అభిప్రాయంలో చిత్ర వర్గాలు ఉన్నట్లు సమాచారం. తమ వద్ద పనిచేసే వ్యక్తిగత సిబ్బందికి అగ్ర హీరోలు సొంత వ్యయంతో వ్యాక్సిన్స్‌ ఇప్పిస్తున్నట్లు తెలిసింది.

ఇటీవల అల్లు అర్జున్‌ తన సహాయక సిబ్బందికి వ్యాక్సిన్స్‌ వేయించినట్లు సమాచారం. తమ సినిమాలకు పనిచేసే యూనిట్‌సభ్యులకు నిర్మాతలే స్వయంగా వ్యాక్సిన్స్‌ ఇవ్వనున్నట్లు చెబుతున్నారు. సినిమా అనేది టీమ్‌వర్క్‌ కాబట్టి. అందరూ ఆరోగ్యంగా, కరోనా రహితంగా ఉంటేనే షూటింగ్‌ సజావుగా సాగుతుంది. యూనిట్‌లోని ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్స్‌ ఇస్తూ నష్టాల బారి నుంచి బయటపడేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.

వ్యాక్సినేషన్‌ తర్వాతే షూటింగ్‌ షురూ?


సెకండ్‌ వేవ్‌ ప్రభావం పెద్ద సినిమాలతో పాటు చిన్న చిత్రాలపై పడింది. కరోనా మొదటి దశలోనూ తగిన జాగ్రత్తలు తీసుకుంటూ తక్కువ మందితో చిన్న సినిమాల చిత్రీకరణలు కొనసాగాయి. సెకండ్‌ వేవ్‌ మూలంగా నటుడు, ప్రయోక్త టీఎన్‌ఆర్‌, దర్శకులు నంద్యాల రవి, శ్రవణ్‌ ,కుమార్‌వట్టితో పాటు పలువురు సినీ ప్రముఖులు కన్నుమూయడంతో అందరిలో భయాలు మొదలయ్యాయి. చిన్న సినిమాల చిత్రీకరణల్ని ఆపేశారు. వారు కూడా వ్యాక్సినేషన్‌ ముగిసిన తర్వాతే షూటింగ్‌ను మొదలుపెట్టడమే మంచిదనే అభిప్రాయానికి వచ్చారు. లాక్‌డౌన్‌ ముగిసినా ఇప్పట్లో షూటింగ్‌లు ప్రారంభించడానికి ఎవరూ సంసిద్ధంగా లేనట్లుగా సమాచారం. పెరుగుతున్న మరణాల సంఖ్య దృష్ట్యా షూటింగ్‌లు ప్రారంభించి అనవసరంగా రిస్క్‌ తీసుకోవడం సరికాదనే అభిప్రాయంతో ఉన్నట్లుగా తెలిసింది.
సినిమా షూటింగ్‌ అంటేనే వందలాది మంది కలిసి పనిచేయాల్సివుంటుంది. భారీ జనసందోహం మధ్య పనిచేసే సమయంలో తమను తాము రక్షించుకోవడానికి వ్యాక్సిన్స్‌ వేసుకోవడమే మార్గమని నాయకానాయికలు భావిస్తున్నారు. ఇప్పటికే రజనీకాంత్‌, కమల్‌హాసన్‌, నాగార్జున, చిరంజీవి, నయనతార, కీర్తిసురేష్‌తో పాటు పలువురు స్టార్స్‌కొవిడ్‌ వ్యాక్సిన్‌ తీసుకున్నారు. షూటింగ్‌లు మొదలయ్యే సమయానికి తాము సంసిద్ధంగా ఉండాలనే యోచనలో హీరోహీరోయిన్లు ఉన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
వ్యాక్సినేషన్‌ తర్వాతే షూటింగ్‌ షురూ?

ట్రెండింగ్‌

Advertisement