Megastar Chiranjeevi – Ram Charan | ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడంలో అగ్రనటుడు మెగాస్టార్ చిరంజీవి ముందుంటారు అన్న విషయం తెలిసిందే. తాజాగా కేరళలోని వయనాడ్ బాధితులను ఆదుకొని తన గొప్ప మనసు చాటుకున్నారు. కేరళలోని వయనాడ్‌లో చోటు చేసుకున్న ప్రకృతి విపత్తుపై (Wayanad Landslide Tragedy) ఆయన స్పందించారు. కేరళ రాష్ట్రం వయనాడ్‌లో కొండచరియలు (Wayanad landslides) విరిగిపడిన ఘటన యావత్ దేశాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 300 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. వందల సంఖ్యలో ప్రజలు గాయాలపాలయ్యారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇక వయనాడ్ విలయంపై పలువురు సినీ తారలు స్పందిస్తున్నారు. బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు తమ వంతు సాయం చేసేందుకు ముందుకొస్తున్నారు.
తాజాగా మెగాస్టార్ చిరంజీవి కూడా తన వంతు సాయంగా కోటి రూపాయలను కేరళ సీఎం రిలీఫ్ ఫండ్‌కు విరాళంగా అందించారు. రామ్ చరణ్ తానే కలిసి ఈ విరాళం ఇస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టాడు. గత కొన్ని రోజులుగా ప్రకృతి ప్రకోపానికి కేరళలో జరిగిన విధ్వంసం వందలాది విలువైన ప్రాణాలను కోల్పోయినందుకు తీవ్ర మనోవేదనకు గురయ్యాను. వయనాడ్ దుర్ఘటన బాధితులకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను. కేరళ సీఎం రిలీఫ్ ఫండ్‌కు చరణ్, నేను కలిసి రూ.1 కోటి విరాళంగా అందజేస్తున్నాం. బాధలో ఉన్న వారందరూ కోలుకోవాలని నా ప్రార్థనలు! అంటూ రాసుకోచ్చాడు.
అంతకుముందు మెగాహీరో అల్లు అర్జున్ కూడా కేరళ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.25 లక్షల విరాళం ఇస్తున్నట్టు ప్రకటించారు. వయనాడ్ ఘటన తనని కలచి వేసిందన్నారు. కేరళ వాసులు తనని ఎంతో అభిమానించారని అల్లు అర్జున్ చెప్పారు. అల్లు అర్జున్‌కు తెలుగులో పాటు మలయాళంలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే. కేరళలో అల్లు అర్జున్‌ని మల్లు అర్జున్ అని ముద్దుగా పిలుచుకుంటారు.
Also Read..